టీమిండియాకు కొత్త కోచ్‌లు వస్తున్నారు..!

టీమిండియాకు కొత్త కోచ్‌లు వస్తున్నారు..!

టీమిండియాకు కొత్త కోచ్‌లు రానున్నారు... ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ 2019తో ప్రస్తుత కోచ్‌ల పదవీకాలం ముగిసిపోగా... భారత జట్టు హెడ్ కోచ్ రవి శాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ కాంట్రాక్ట్‌ను మరో 45 రోజుల పాటు పొడిగించింది బీసీసీఐ. ఇక, కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించింది బోర్డు... దీని కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇవాళ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. టీమిండియా హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్‌, బౌలింగ్ కోచ్‌, ఫీల్డింగ్ కోచ్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, స్ట్రెంగ్త్ అండ్ కండిష‌నింగ్ కోచ్‌, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది బీసీసీఐ. ఇక, ఈ సారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు విధించింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవం ఉండాలని, వయసు 60 ఏళ్లకు మించరాదని పేర్కొంది. జులై 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. అయితే హెడ్ కోచ్ రవి శాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ ఆటోమెటిక్‌గా ఎంట్రీ పొందుతారు. 

మరోవైపు వరల్డ్ కప్‌లో బీసీసీఐ అంచనాలు తలకిందులయ్యాయి... ఫైనల్ మ్యాచ్ కూడా గెలిచేది మనమేనన్న నమ్మకంతో అప్పటి వరకు టికెట్లను కూడా బుక్ చేయలేదు బోర్డు.. కానీ, సెమీస్‌లోనే టీమిండియా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక, వరల్డ్‌కప్‌లో భారత జట్టు వైఫల్యం త‌ర్వాత ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసు ఇప్పటికే తమ పదవులు నుంచి తప్పుకోకున్నారు. మరి కొత్తగా వచ్చే కోచ్‌లు ఎవరు? స్వదేశానికి చెందిన మాజీలు ఈ అవకాశాన్ని చేజికించుకుంటారా? లేక విదేశీ ఆటగాళ్లు టీమిండియా కోచ్ పగ్గాలు చేపట్టనున్నారా? అనే ఆసక్తి నెలకొంది.