బ్రేకింగ్ : 2020 ఆసియా కప్ రద్దు... 

బ్రేకింగ్ : 2020 ఆసియా కప్ రద్దు... 

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన గంగూలీ.. అందులో భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ జట్టును తిరిగి మైదానంలో ఎప్పుడు చూడగలరు అని అడిగిన ప్రశ్నకు... సమాధానంగా.. "భారతదేశం మొదట ఏ సిరీస్‌ను ఆడుతుందో చెప్పడం చాలా కష్టం. కరోనావైరస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. మనం చేయగలిగేది వేచి ఉండటమే. అయితే ఐపీఎల్ 2020 వాయిదా పడింది. టీ 20 ప్రపంచ కప్ పై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటే... మనము ఐపీఎల్ గురించి ఆలోచించగలము. ఇక  సెప్టెంబరులో  జరగాల్సిన ఆసియా కప్ రద్దు చేయబడింది. కాబట్టి భారతదేశంలో క్రికెట్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో ప్రస్తుతానికి నేను చెప్పలేను అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ ఈ ఏడాది చివర్లో శ్రీలంకలో లేదా యుఎఇలో షెడ్యూల్ చేసిన విధంగా ఆసియా కప్ 2020 ముందుకు సాగుతుందని హామీ ఇచ్చిన కొద్ది రోజులకే గంగూలీ ఈ ప్రకటన చేసారు. అయితే ఈ విషయం పై పీసీబీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.