పాక్ ఆసియా కప్ బిడ్ కు బీసీసీఐ మద్దతు

పాక్ ఆసియా కప్ బిడ్ కు బీసీసీఐ మద్దతు

ఇటీవల సింగపూర్ లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో 2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కు దక్కేందుకు భారత్ మద్దతిచ్చిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎహ్సాన్ మని చెప్పారు. 'భారత్ మా బిడ్ కు మద్దతు తెలిపింది. కానీ వేదికలను తర్వాత నిర్ణయిస్తాం. ఈ టోర్నమెంట్ కు తమ జట్టును పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తే మేం పాకిస్థాన్ లో మ్యాచ్ లు నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. లేకపోతే యుఏఈ రెండో ప్రత్యామ్నాయం' అని లాహోర్ లో మీడియాకు మని తెలిపారు.

దేశానికి అంతర్జాతీయ క్రికెట్ ను తీసుకొచ్చేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నట్టు మని చెప్పారు. అందువల్ల పాక్ లోనే మ్యాచ్ లు నిర్వహించడానికి మొదటి ప్రాధాన్యత అన్నారు. 'కానీ పాక్ పర్యటనకు భారత జట్టుకి అనుమతి లభించడంపైనే అంతా ఆధారపడి ఉందని' వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో కరాచీ, దుబాయ్ లలో ఆసియన్ ఎమర్జింగ్ నేషన్స్ కప్ నిర్వహించారు. ఇందులో భారత్ తన అన్ని మ్యాచ్ లను యుఏఈలో ఆడగా పాకిస్థాన్ తన గ్రూప్ మ్యాచ్ లను కరాచీలో ఆడింది. ఫైనల్ రౌండ్ కు యుఏఈకి చేరుకుంది.

పాకిస్థాన్, భారత్ ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ రద్దయినప్పటికీ ఇరు బోర్డుల మధ్య సుహృద్భావ సంబంధాలే ఉన్నాయిన మని స్పష్టం చేశారు. 'రెండు బోర్డులకు పరస్పరం ఎలాంటి వైషమ్యాలు లేవు, మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్ లో ద్వైపాక్షిక బంధాలు పునరుద్ధరించడమే మా విధానం. కానీ మాతో ఆడాలని మేం వాళ్లని అడుక్కోవడం, విజ్ఞప్తులు చేయడం చేయబోం' అని మని అన్నారు. 

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే వరల్డ్ టీ20 టోర్నమెంట్ కి ముందు సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగనుంది. సరిహద్దు దాటి ప్రయాణించేందుకు పాకిస్థాన్ నిరాకరించడంతో గత ఆసియా కప్ ను భారత్ పోయినేడాది యుఏఈలో నిర్వహించింది.