వరల్డ్‌కప్ నుంచి పాక్‌ను తప్పించండి: బీసీసీఐ

వరల్డ్‌కప్ నుంచి పాక్‌ను తప్పించండి: బీసీసీఐ

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఆడుతుందా లేదా అన్న చర్చ నడుస్తోంది. దాడి జరగడంతో భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడాలా వద్దా అనే విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు క్రికెట్ పెద్దలు. వరల్డ్ కప్‌ నుండి పాక్‌ను నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలికి లేఖ రాసేలా బీసీసీఐపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్. అయితే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం జరగనున్న భేటీలో దీనిపై చర్చించనున్నట్టు సమాచారం.

పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తుందని, అలాంటి దేశంతో క్రికెట్ ఆడడం ఎవరికీ మంచిది కాదని ఐసీసీకి బీసీసీఐ లేఖ ద్వారా వివరించనుంది. ఈ నెల 27 నుంచి ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ముందే పాకిస్థాన్‌ను వరల్డ్‌కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ.. ఐసీసీకి బోర్డు లేఖ రాయనుంది.