నేటి నుంచే కొత్త బీరు ధరలు  

నేటి నుంచే కొత్త బీరు ధరలు    

తెలంగాణలో బీరు ధరలు భారీగా పెరిగాయి. సహజంగా వేసవిలో బీరుకు భారీ డిమాండ్. ఈ అవకాశాన్ని అదునుగా భావించిన ప్రభుత్వం సరైన టైమ్ లో రేట్లను పెంచేసింది. బీరు తయారీదారులకు రేట్లు పెంచడంతో.. అది పరోక్షంగా మద్యపాన ప్రియులపైనే పడుతోంది. ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయంతో ప్రస్తుతం రూ.110 ఉన్న స్ట్రాంగ్‌ బీరు ధర రూ.120 కానుంది. రూ.90 వరకు ఉన్న లాగర్‌ (లైట్‌) బీరు ధర రూ.100 కానుంది. 

తెలంగాణ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఈ ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. బీరు రేట్లను పెంచడంతో ప్రభుత్వానికి నెలకు రూ.100 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది. బీరు కేస్‌ (12 బాటిళ్లు) బేసిక్‌ ప్రైస్‌ను పెంచాలని తెలంగాణ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ గతంలోనే నిర్ణయం తీసుకున్నా.. పెంపు శాతాన్ని నిర్ణయించడానికి రిటైర్డ్‌ జడ్జి, రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్లతో 'రేట్‌ కాంట్రాక్టు అండ్‌ నెగోషియేషన్స్‌ కమిటీ'ని వేసింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఈ మధ్యనే మద్యం రేట్లను 5, 8, 10, 12 శాతాల చొప్పున పెంచింది. దీంతో బీరు బేసిక్‌ ప్రైస్‌ను కూడా పెంచాలంటూ బ్రూవరీ యాజమాన్యాలు డిమాండ్‌ చేశాయి. దీంతో వారితో కమిటీ చర్చలు జరిపింది. ఒక్కో యాజమాన్యం ఒక్కో రకంగా పెంచాలంటూ ప్రతిపాదించాయి. చివరకు లైట్‌ బీరుపై రూ.10, స్ట్రాంగ్‌ బీరుపై రూ.11 చొప్పున పెంచాలంటూ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసును బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బోర్డు ఆమోదించి ప్రభుత్వానికి పంపడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఫైల్ కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో  ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో పెరిగిన ధర నిన్నటి నుండే అమలులోకి వచ్చింది.