‘ఆపరేషన్ బాలాకోట్‘ ముందు, తర్వాత చిత్రాలివే

‘ఆపరేషన్ బాలాకోట్‘ ముందు, తర్వాత చిత్రాలివే

పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై భారతీయ వాయుసేన దాడికి రుజువులు కోరుతున్నారు. ఈ దాడుల్లో ఎందరు ఉగ్రవాదులు మరణించారని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని ఉపగ్రహ చిత్రాలు బయటికొచ్చాయి. వీటిలో బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై దాడులకు ముందు, దాడుల తర్వాత చిత్రాలు ఉన్నాయి. ఈ ఫోటోలు ప్రభుత్వం లేదా వాయుసేన జారీ చేయలేదు. ఇవన్నీ ప్రైవేట్ శాటిలైట్ నుంచి తీసిన ఫోటోలు. వీటిని రాయిటర్స్ వార్తాసంస్థ విడుదల చేసింది. ఈ చిత్రాలను జాగ్రత్తగా గమనిస్తే వీటిలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు భారీ నష్టం వాటిల్లినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

బాంబులు వేసిన తర్వాత కూడా కొన్ని నిర్మాణాలు నిలిచి ఉండటం ఈ చిత్రాల్లో కనిపిస్తోంది. మన యుద్ధవిమానాలు ఈ దాడుల్లో ఉపయోగించిన ‘స్పైస్ 2000 బాంబు‘లు దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ బాంబులు లోపలికి చొచ్చుకుపోయి పేలుతాయి. పైకప్పులకు ఏర్పడిన రంధ్రాలే బాంబులు పడ్డాయనడానికి రుజువు. ఈ బాంబులు ఎంతో ప్రభావవంతమైనవి. దాడికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఐఏఎఫ్ కూడా ప్రభుత్వానికి అందజేసింది. వీటిలో స్పైస్ 2000 గ్లైడ్ బాంబులతో ఐదు నిర్మాణాలపై బాంబుల ప్రభావం కనిపించింది.

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా లో ఉన్న బాలాకోట్ సమీపాన బిసియాన్ ప్రాంతం దగ్గరి కొండపై ఉంది. స్పైస్ 2000 బాంబులు సరిగ్గా లక్ష్యాన్ని తాకినట్టు రక్షణ వర్గాలు చెప్పాయి. పేలుడు తాలూకు గుంతలుగా చెబుతున్నవి ఉగ్రవాదులు తమ శిక్షణలో భాగంగా పేల్చిన ఐఈడీ తాలూకువని అంటున్నారు. స్పైస్ 2000 బాంబులు అలాంటి గుంతలు చేయవని చెబుతున్నారు. సెప్టెంబర్ 2016లో పోఖారన్ లో ఈ బాంబులు వినియోగించినప్పటి సంఘటనలను గుర్తు చేస్తున్నారు.