బేగూసరాయ్ లో కన్హయ్య కుమార్ ఓటమి

బేగూసరాయ్ లో కన్హయ్య కుమార్ ఓటమి

బీహార్ లోని బేగుసరాయ్ నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్ యువ రాజకీయనేత కన్హయ్య కుమార్ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేతుల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్ యు) మాజీ విద్యార్థి నాయకుడు సీపీఐ టికెట్ పై మొదటిసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కన్హయ్య పోటీలోకి దిగడంతో బేగుసరాయ్ సీటు ఫలితంపై యావద్దేశం దృష్టి కేంద్రీకృతమైంది. అయితే హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు పూర్తిగా ఏకపక్షంగా మారింది. బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ 3.5 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. గిరిరాజ్ సింగ్ కు 56 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మొత్తం 5,74,671 ఓట్లు సాధించారు. లెఫ్ట్ ఫ్రంట్ ఉమ్మడి అభ్యర్థి కన్హయ్య కుమార్ కు 2,23,770 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్ కు 1,65,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు గిరిరాజ్ సింగ్ బీహార్ లోనే అత్యంత భారీ ఘన విజయం సాధించినట్టు చెబుతున్నారు. ఈ విజయంతో ఒకప్పుడు బీహార్ లెనిన్ గ్రాడ్ గా పేరొందిన బేగుసరాయ్ ఇప్పుడు బీజేపీ కంచుకోటగా మారింది.