ఉత్కంఠ పోరులో బెల్జియం విజయం

ఉత్కంఠ పోరులో బెల్జియం విజయం

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బెల్జియం జట్టు ఉత్కంఠ పోరులో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సోమవారం హోరాహోరాగా సాగిన పోరులో బెల్జియం 3-2 తేడాతో జపాన్‌ను ఓడించింది. తొలి భాగంలో ఇరు జట్లు గోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసాయి కానీ గోల్ కీపర్లు అడ్డుకోవడంతో బంతి గోల్ పోస్ట్ లోనికి వెళ్ళలేదు. ఇరు జట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మొదటి భాగం గోల్ లేకుండానే ముగిసింది. రెండో అర్థ భాగం ఆట 48వ నిమిషంలో హరగుచి గోల్‌ సాధించగా, 52వ నిమిషంలో టకాషి ఇనుయ్‌ మరో గోల్‌ సాధించడంతో జపాన్‌ ఒక్కసారిగా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ సాధించి బెల్జియంపై ఒత్తిడి పెంచింది. ఈ సమయంలో బెల్జియం జట్టుకు 70వ నిమిషంలో వెర్టోన్‌గెన్‌ గోల్‌ సాధించగా... 75వ నిమిషంలో ఫెల్లానీ మరో గోల్ సాధించి స్కోరును సమం చేసాడు. ఆట సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఇరు జట్లు గోల్‌ సాధించడం కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఎక్ట్రా సమయం( 90 +4)లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బెల్జియం ఆటగాడు చాడ్లి గోల్‌ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. 

Photo: FileShot