బెల్జియం సూపర్ 'షో'

బెల్జియం సూపర్ 'షో'

సోమవారం గ్రూప్‌ 'జి'లో జరిగిన మ్యాచ్‌లో.. బెల్జియం మైదానంలో సూపర్ 'షో' చేయడంతో కొత్త జట్టు పనామాపై 3-0 తేడాతో విజయం సాధించింది. చిన్న జట్టు అయినప్పటికీ పనామా ఆట ప్రథమార్ధంలో బెల్జియం జట్టుకు గట్టి పోటీని ఇచ్చింది. ఆట ప్రారంబయిన నాలుగో నిమిషంలోనే పనామాకు ఫ్రీకిక్‌కు లభించినా.. గోల్ చేయడంలో విఫలమయింది. ఇక పదో నిమిషంలో పనామా కెప్టెన్‌ రోమన్‌ టోరెస్‌ ‘డి’ సర్కిల్‌లో బంతిని ఆపి తమ కీపర్‌కు పాస్‌ ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న హజార్డ్‌ గోల్ చేయడంలో విఫలమయ్యాడు. 20వ నిమిషంలో కూడా డిబ్రుయిన్‌ లోక్రాస్‌ షాట్‌ను లుకాకుకు పంపాలని చూసినా టోరెస్‌ అడ్డుకున్నాడు. ఇదేవిధంగా ఎదురుదాడి చేస్తూ పనామా ఆధిక్యం ప్రదర్శించింది. ఇరు జట్లు పోటా పోటీగా ఆడడంతో మొదటి భాగం గోల్‌ లేకుండానే ముగిసింది.

రెండో భాగం ప్రారంభంలోనే బెల్జియం దూకుడు పెంచింది. 47వ నిమిషంలో స్ట్రయికర్‌ డ్రీస్‌ మెర్టెన్స్‌ అద్భుత రీతిలో గోల్ చేసి బెల్జియంకు ఆధిక్యం అందించాడు. మద్యలో పనామా జట్టుకు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు 69వ నిమిషంలో డిబ్రుయెన్‌ అందించిన క్రాస్‌ను స్ట్రయికర్‌ లుకాకు  గోల్‌గా మలిచాడు. ఆ వెంటనే 75వ నిమిషంలో ఈడెన్‌ హజార్డ్‌ నుండి అందిన పాస్ ను లుకాకు వేగంగా పరుగెడుతూ గోల్‌గా మార్చాడు. దీంతో బెల్జియం 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో భాగం ముగిసేసరికి పనామా జట్టు ఒక్క గోల్ కూడా చేయలేక ఓటమి చవిచూసింది. కొద్దీపాటి సమయంలోనే రెండు గోల్స్ ఇచ్చి  పనామా జట్టు మూల్యం చెల్లించుకుంది. మరోవైపు పనామా జట్టు ఆటగాళ్లు ఐదుగురు ఎల్లోకార్డ్‌ను ఎదుర్కోవడం కూడా జట్టుపై ప్రభావం చూపింది.