ఇంగ్లండ్‌ క్రికెటర్‌ వ్యక్తి'గతం' మీద కధనం...ఇంత దిగజారతారా ?

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ వ్యక్తి'గతం' మీద కధనం...ఇంత దిగజారతారా ?

క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ పోరులో ఎట్టకేలకు ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన కలను నెరవేర్చకుంది. ఫైనల్ పోరులో తన అసాధారణ పోరాటపటిమతో న్యూజీల్యాండ్ విజయానికి అడ్డుకట్టవేసిన బెన్ స్టోక్స్‌ వాస్తవానికి పుట్టుకతో న్యూజీల్యాండ్ కి చెందిన వ్యక్తి. అక్కడే క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టిన ఈ ఆల్ రౌండర్ 12 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వలస వచ్చాడు.

స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ ఒకప్పుడు న్యూజీల్యాండ్ రగ్బీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని ఒక రగ్బీ జట్టుకు కోచ్‌గా పనిచేసేందుకు కుటుంబంతో సహా వలసవచ్చాడు. బెన్ స్టోక్స్‌కు ఇంగ్లండ్‌లోనే క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్టోక్స్ రైట్ హ్యాండ్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ చరిత్రలోనే గొప్ప ఆల్‌రౌండర్‌లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

అయితే అతని వ్యక్తిగత జీవితం గురించి ద సన్‌ పత్రిక ప్రచిరించిన కధనం మీద ఆయన మండిపడ్డాడు. ఆ కథనం అనైతికమని ఆయన అన్నాడు. ‘స్టోక్స్‌ సీక్రెట్‌ ట్రాజెడీ’ అనే పేరుతో సన్ పత్రిక ఆ కథనాన్ని ప్రచురించింది. ‘‘స్టోక్స్‌ అక్క, అన్నను అతడి తల్లి మాజీ ప్రియుడు చంపేశాడు. స్టోక్స్‌ పుట్టడానికి మూడేళ్ల ముందు ఇది జరిగిందని సదరు పత్రిక కధనాన్ని ప్రచురించింది. దీనిపై స్టోక్స్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత విషయాలు అది కూడా తాను పుట్టాక మునుపు జరిగిన విషయాలను ఇప్పుడు ప్రచురించడం ఎంతవరకు సబబు అని ?  జర్నలిజం పేరుతో దిగజారతారా? అని ఆయన ప్రశ్నించాడు.