దీదీ కామెంట్స్.. అసదుద్దీన్ కౌంటర్..!

దీదీ కామెంట్స్.. అసదుద్దీన్ కౌంటర్..!

తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తీవ్రవాదంపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన దీదీ.. పరోక్షంగా ఎంఐఎంపై ఆరోపణలు గుప్పించారు.. కూచ్‌బిహార్‌లో జ‌రిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్రవాదులుగా మారుతున్నారంటూ కామెంట్ చేశారు. హిందువుల్లో తీవ్రవాదులు ఉన్నట్టుగానే.. మైనార్టీల్లోనూ తీవ్రవాదం పుట్టుకొస్తుందంటూ... పరోక్షంగా భారతీయ జనతా పార్టీతో పాటు ఎంఐఎంపై కూడా విమర్శలు చేశారు. అంతేకాదు.. బీజేపీ నుంచి ఓ మైనార్టీ రాజ‌కీయ పార్టీ డ‌బ్బులు తీసుకుందని సంచలన ఆరోపణల చేసిన దీదీ.. అది హైదారాబాద్‌కు చెందిన‌ పార్టీ, బెంగాల్ పార్టీ కాదంటూ వ్యాఖ్యానించారు. 

ఇక, దీదీ ఆరోపణలపై ఘాటుగానే స్పందించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ.. తమపై మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్నారంటే.. ఆ రాష్ట్రంలో ఎంఐఎం త‌న ద‌ళాన్ని ఏర్పాటు చేస్తున్నట్టే, పార్టీ బలపడుతున్నట్టేనని వ్యాఖ్యానించారు. దీనిపై అవసరం మాటలు మాట్లాడుతూ బెంగాల్‌ సీఎం మ‌మ‌తా.. త‌న భ‌యాన్ని, ఆందోళ‌న‌ల‌ను వ్యక్తం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. హైద‌రాబాద్‌కు చెందిన కొంద‌రి గురించి దీదీ భ‌య‌ప‌డితే.. మ‌రి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 18 స్థానాల్లో ఎలా విజయం సాధించింది అని ప్రశ్నించారు ఎంఐఎం చీఫ్. మొత్తానికి దీదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తృణమూల్, ఎంఐఎం మధ్య విమర్శలు, ఆరోపణలకు దారితీస్తోందంటున్నారు విశ్లేషకులు.