బెంగాల్ హింసాకాండపై మోడీ, షాలకు రిపోర్ట్

బెంగాల్ హింసాకాండపై మోడీ, షాలకు రిపోర్ట్

ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ హింసాకాండతో అట్టుడుకుతోంది. ఇప్పటి వరకు ఈ హింసలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఢిల్లీకి వచ్చిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ బెంగాల్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు వివరించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధాని, హోమ్ మంత్రిలతో త్రిపాఠీ భేటీ కావడం ఇదే మొదటిసారి. 'పశ్చిమ బెంగాల్ లో పరిస్థితిని ప్రధానమంత్రి, హోమ్ మంత్రికి వివరించారు. ఆ వివరాలను నేను వెల్లడించలేనని' సోమవారం షాను కలిసిన తర్వాత త్రిపాఠీ చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాల గురించి ప్రశ్నించగా తన సమావేశాలలో అలాంటి చర్చే జరగలేదని ఆయన స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల మధ్య విమర్శల యుద్ధం ముమ్మరంగా సాగుతున్న సమయంలో దేశ రాజధానికి గవర్నర్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం హోమ్ శాఖ జారీ చేసిన ప్రకటనలో పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న హింసాకాండపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లోక్ సభ ఎన్నికల నుంచి అదుపు లేకుండా సాగుతున్న హింసాకాండ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తోందని చెప్పింది. ఎన్నికల అనంతరం చెదురుమదురు ఘర్షణలు మినహా రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఘాటుగా బదులిచ్చింది.