విరాళాల డబ్బుతో రూ.1.6 కోట్ల విల్లా కొన్నాడు!!

విరాళాల డబ్బుతో రూ.1.6 కోట్ల విల్లా కొన్నాడు!!

ఇటీవల బెంగుళూరులో ఒక ఆటో డ్రైవర్ రూ.1.6 కోట్ల విలువైన విల్లాను నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ధనికులు నివసించే గేటెడ్ సొసైటీలో కొనడం సంచలనంగా మారింది. అయితే ఇందులో అవకతవకలు జరిగనట్టు వస్తున్న వార్తలను ఆదాయపన్ను శాఖ కొట్టి పారేసింది. ఇంత ఖరీదైన భవంతి కోసం స్థానిక రాజకీయ నాయకులతో చేతులు కలిపాడనే అనుమానంతో 37 ఏళ్ల నల్లురల్లి సుబ్రమణిపై ఐటీ శాఖ కన్నేసి ఉంచింది. అయితే సుబ్రమణి ఈ ఆరోపణలన్నీ తిరస్కరిస్తూ తనకు ఇంత మంచి జీవితాన్నిచ్చిన ఒక ప్రయాణికుడికి కృతజ్ఞతలు తెలిపాడు.

అతని సమాధానంతో సంతృప్తి చెందని ఐటీ అధికారులు అతనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఆటోడ్రైవర్ పై బినామీ ఆస్తి వ్యవహారాల నిరోధక చట్టం, 1988 కింద నోటీసుల ఇచ్చారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం వాళ్లు మహాదేవపురాలోని ఆ కాలనీ డెవలపర్ ని కూడా ప్రశ్నించారు. కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. గతంలో ఒకసారి సుబ్రమణితో కనిపించినందుకు కర్ణాటక బీజేపీ జనరల్ సెక్రటరీ, మహాదేవపురా ఎమ్మెల్యే అరవింద్ లింబావలీపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే చాలా కాలం క్రితం ఒక సందర్భంలో మాత్రమే వీళ్లిద్దరు కలిసినట్టు గుర్తించి ఇది నిరాధారమైన అనుమానంగా తేల్చారు.

చివరకు లారా ఎవిసన్ అనే అమెరికా దాత ఈ సంపత్తి ఇచ్చినట్టు మంగళవారం ఐటీ అధికారులు ప్రకటించారు. 2006లో 72 ఏళ్ల విదేశీ మహిళ నగరంలో పర్యటించేందుకు సుబ్రమణి సాయం చేశాడు. అతని ఆర్థిక పరిస్థితిపై జాలిపడిన ఆమె అతని పిల్లల చదువులకు సాయం చేయాలని భావించింది. ఆ తర్వాత మహాదేవపురాలోని జట్టి ద్వారకామాయిలో విల్లా కొనుక్కొనేందుకు ఆమె సాయపడిందని అధికారులు తెలిపారు.