పిజ్జా ఆర్డర్.. రూ.95 వేలు మాయం..!
కంత్రీగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో డబ్బులు కొట్టేస్తున్నారు.. తమ మోసాలకు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుంటున్నారు.. పిజ్జా తిందామని ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఓ ఐటీ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.95వేలు దోచేశారు సైబర్ కేటుగాళ్లు.. సదరు ఉద్యోగికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఈ మొత్తం మాయం చేశారు. ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే కోరమంగళ 1వ బ్లాక్‌లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగి షేక్.. ఈ నెల 1వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు.. అయితే, పిజ్జా వస్తుందని ఎంత ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. దీంతో ఆ యాప్‌కు చెందిన కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు.. అయితే, కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి నుంచి ఊహించని సమాధానం వచ్చింది.. పిజ్జా ఆన్లైన్లో డెలివరీ చేయడం లేదని.. మీ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని నమ్మబలికాడు.. దీంతో.. తన డబ్బు తిరిగి వస్తుందని నమ్మిన షేక్.. అవతలి వ్యక్తి పంపిన ఓ వెబ్సైట్ లింక్‌ను ఓపెన్ చేసి తన ఫోన్‌పే వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేశాడు.. ఆ వెంటనే షేక్‌కు చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.45వేలు, ఆంధ్రాబ్యాంక్ ఖాతా నుంచి రూ.50వేలు.. మొత్తం రూ.95 వేలు క్షణాల్లో మాయం చేశారు. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అవ్వడాన్ని గమనించిన షేక్.. ఆ తర్వాత మడివాలా పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిస్ చేసి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)