తీపికబుర్ల అందగత్తెలతో జాగ్రత్త!

తీపికబుర్ల అందగత్తెలతో జాగ్రత్త!

మీరు యుక్తవయసులో ఉన్నారా? పేరు తెలియని, ఊరు తెలియని అందమైన గొంతున్న అమ్మాయిలు మీతో ఉల్లాసంగా మాట్లాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఏదో రకంగా నెంబరు సంపాదించడం, ఆ తరువాత ప్రతిరోజూ క్షేమ సమాచారాలు ఆరా తీయడం, మాట కలిపి మనసుకు దగ్గరవడం.. ఇక ఆ తరువాత ఏదో అవసరం ఉందని, కష్టాల్లో ఉన్నానంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగి డబ్బు గుంజడం, అటు తరువాత ఫోన్ స్విచ్చాఫ్ చేయడం... మహా నగరాల్లోనే ఎక్కువగా కనిపించే ఇలాంటి కేసులు.. కొంతకాలంగా హైదరాబాద్ లో కూడా పెరిగిపోయాయంటున్నారు పోలీసులు. ఈ విషయం గుర్తించకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని యూత్ ను, ముఖ్యంగా ఐటీ పీపుల్ ని హెచ్చరిస్తున్నారు. 

ఆన్ లైన్ విస్తృతి కారణంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ తో వల వేసే వయ్యారిభామలకు అవకాశాలు బాగా పెరిగిపోయాయి. వారి టార్గెట్ అంతా 18-30 ఏళ్ల లోపు వయసు గల పురుష పుంగవులేనట. ఎందుకంటే ఆ వయసువారు తొందరగా ఎమోషనల్ అవుతారని, తొందరగా బుట్టలో పడతారని.. అందుకే వారికి వల వేసే మోసగత్తెల సంఖ్య బాగా పెరిగిందని హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలే ముగ్గులోకి లాగడం గానీ, అమ్మాయిలు అన్న భ్రమ కల్పిస్తూ అబ్బాయిలే మోసానికి తెగబడడం గానీ జరుగుతుందని వారంటున్నారు. 

అలాంటి మోసగత్తెలకు సోషల్ మీడియాతో పాటు డేటింగ్ యాప్స్ కూడా అనుకూలంగా మారాయి. అలాంటి మాధ్యమాల్లో చాటింగ్ లు చేయడం, యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం సరికాదని, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని అలర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యే తమకు ఇలాంటి రెండు కేసులు తగిలాయని.. ఓ కేసులో ఓ ఐటీ ప్రొఫెషనల్ నుంచి రూ. 8 వేలు లాగిన మహిళ.. డబ్బు చిక్కిన తెల్లవారే ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుందని, అప్పుడే ఆ యువకుడు మోసపోయినట్లు గుర్తించాడని చెబుతున్నారు. మరో కేసులో నెల రోజుల నుంచీ ఫోన్లో టచ్ లో ఉన్న మహిళ.. అకస్మాత్తుగా శృంగారానికే ఆహ్వానించిందట. అప్పటిదాకా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అతగాడు.. అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అమాయకంగా అడిగితే.. తన తండ్రికి ఆరోగ్యం బాలేదని, అందుకు రెండు లక్షలు ఖర్చవుతాయని నమ్మబలికిందట వగలాడి. ఎమోషన్ కు లోనైన ఆ యువకుడు రూ. 2 లక్షలూ సమర్పించుకున్నాడు. ఇక ఆ తరువాత అటువైపు ఫోన్ స్విచ్చాఫ్. 

అయితే ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి మోసాల మీద కేసులు పెడితే పరువు పోతుందన్న ఫీలింగ్స్ తో మగాళ్లెవరూ కంప్లయింట్లు చేయడం లేదంటున్నారు పోలీసులు. ఫిర్యాదు చేయకుండా తామెవరి మీదా యాక్షన్ తీసుకోవడం సాధ్యం కాదని తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నారు.