పోలవరంతో భద్రాచలానికి ముప్పు

పోలవరంతో భద్రాచలానికి ముప్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలంతో పాటు బొగ్గు గనులున్న ప్రాంతాలకూ ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కారు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంత భూభాగం, అక్కడి ప్రజల మనోభావాలు, పర్యావరణం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మరోసారి పూర్తిస్థాయిలో సమగ్ర సర్వే చేపట్టాని కోరింది.  ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అఫిడవిట్ లో కోరింది.  

ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిషా ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు పరిధిలోకి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తీసుకురావాలన్న ఒడిషా వినతిని సుప్రీం అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేయాలని సుప్రీం ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ వైద్యనాథన్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ వేగం వస్తుందన్న అంచనాతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని.. గోదావరిలో ఒక్కసారిగా అంత భారీ ప్రవాహం వస్తే, భద్రాచలంతో పాటు బొగ్గు నిల్వలు ఉండే మణుగూరు తదితర ప్రాంతాలు తీవ్రమైన ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.