కత్తి మహేష్‌పై దాడి.. ఐమాక్స్ వద్ద కలకలం !

కత్తి మహేష్‌పై దాడి.. ఐమాక్స్ వద్ద కలకలం !

ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నా కత్తి మహేష్ తన తీరు మార్చుకోవడం లేదు. ఒక సారి హిందువుల మీద కామెంట్స్ చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురయిన ఆయన మళ్ళీ తన పాత అవతారం ఎత్తాడు. నగరానికి వచ్చిన కొద్ది రోజుల దాకా సైలెంట్ గానే ఉన్నా కూడా ఇప్పుడు మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. మొన్న రాముడి మీద చేసిన కామెంట్స్ మీద పోలీసు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం హిందూ సంఘాల్లో కోపాన్ని పెంచేస్తున్నాయి. శ్రీ రాముడు మాంసం తింటాడని.. ఆయనకు జింక మాంసం అంటే ఇష్టమని ఈ మధ్యే కామెంట్ చేసాడు కత్తి మహేష్. అయితే ఈరోజు ఆయన మీద దాడి జరిగింది.

ఐమాక్స్‌ కు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసేందుకు వచ్చిన ఈయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. సినిమాకు వచ్చిన సంగతి తెలుసుకున్న బజరంగ్ దళ్ కి చెందిన కొందరు వ్యక్తులు బయట కత్తి కోసం కాచుకుని ఉన్నారు. సినిమా ముగించుకుని వెళ్తున్న ఆయన కారుపై దాడి చేశారు. దాంతో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఐమాక్స్‌కు చేరుకుని కత్తి మహేష్‌ను అక్కడ్నుంచి సేఫ్‌ గా పంపించారు. అయితే కత్తి వచ్చిన విషయాన్ని తెలుసుకుని దాడి చేయడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.