చంద్రబాబు హిందూ ఆచారాలకు తూట్లు పొడుస్తున్నారు...

చంద్రబాబు హిందూ ఆచారాలకు తూట్లు పొడుస్తున్నారు...

హిందూ ఆచారాలకు ఏపీ సీఎం చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని వైకాపా కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... తిరుమల ఆలయంపై టీడీపీ ప్రభుత్వం విషప్రయోగం చేసి సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీయాలని చూస్తోందన్నారు. రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య కుంపటి పెట్టినట్లు.. తిరుమలలోని వారసత్వ కుటుంబాల్లోనూ చిచ్చుపెట్టి వారి మరణకాండను చంద్రబాబు వెలిగించారని ఆయన ధ్వజమెత్తారు. గోపినాధ్ దీక్షితుల కుటుంబం స్వామివారికి కైంకర్యం చేస్తున్నారని.... వీరితో పాటు నాలుగు కుటుంబాల వాళ్ళు ఒక వృత్తిగా కాకుండా.. దీన్ని స్వామి వారు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయానికి ఇంతటి ప్రాచుర్యం పొందడానికి ఈ నాలుగు కుటుంబాల కైంకర్యం సేవలే కారణమని కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వామీలు సైతం అర్చకుల కైంకర్యంలో చేదోడువాదోడుగా ఉన్నారే తప్పా.. ఎప్పుడూ వారిని దాటి వెళ్ళలేదు అని గుర్తు చేసారు. ఇలాంటి ఆచార వ్యవహారాలను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించడం దారుణమని భూమన అన్నారు.

అమరావతిలో బౌద్ధ ఆచారాలను నెలకొల్పాలని భావిస్తున్న చంద్రబాబు.. హిందూ ఆచారాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. శ్రీవారి ఆలయం విషయంలో రమణదీక్షీతులు చేసిన అనుమానాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయంలోని పోటులో ఏదో జరిగిందనే  అనుమానాలను నిరువృత్తి చేయాల్సిన బాద్యత ప్రభుత్వానిదే అని భూమన అన్నారు. స్వామివారి ఆలయంలో పనిచేసే ప్రతి ఒక్క అర్చకుడు మాకు దైవ సమానులే అని తెలిపారు. అలాంటి వారు చంద్రబాబు ఉచ్చులో పడి పావులుగా మారి...  దిగజార్చుకునేలా అర్చకులు వ్యవహారించడం దారుణమన్నారు. అర్చకుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చంద్రబాబు చలి కాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అర్చకుల మధ్య ఉన్న చిన్నచిన్న మనస్పర్ధలను చంద్రబాబు తన రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం  తిరుమలలో జరుగుతున్న వివాదాలకు మూల కారణం చంద్రబాబు అని పేర్కొన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

వజ్రం జెనీవాలో అమ్ముడైందని అనుమానాలపై రమణదీక్షీతులు కోరినట్లు.. సీబీఐ ఎంక్వయిరీ వేయాలని భూమన  డిమాండ్  చేశారు. అలాగే అధికారులు, రమణదీక్షీతులు తప్పులు చేశారనే అనుమానం ఉంటే వాటిపైనా సీబీఐ ఎంక్వయిరీని ప్రభుత్వం కోరాలన్నారు. శ్రీవారి కైంకర్యం చేసే వారి కుటుంబాల్లోని వారికి ప్రధాన అర్చకుల నియామకంపై రాజకీయ చేయడం మహాపాపమని.... ఈ పాపం చంద్రబాబుదే అని విమర్శించారు. ప్రభుత్వం మీద భయంతో జియర్ వ్యవస్థ, అర్చకులను బెదిరించి మాట్లాడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల గిరులతో చంద్రబాబు రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నారన్నారు. పాలక మండలిని పాపాల మండలిగా మార్చి రెండువేల సంవత్సరాల నాటి ఆచారవ్యవహారాలను హరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పి ఇప్పటికైనా చంద్రబాబు తప్పు సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన అర్చకులను తిరిగి నియమించి వారికి సరైన గౌరవం ఇస్తాం అని హామీ ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి.