భువనగిరిలో ఎందుకు ఓడిపోయామంటే..

భువనగిరిలో ఎందుకు ఓడిపోయామంటే..

భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం చాలా బాధాకరమని.. ఇది కలలో కూడా ఉహించలేదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బూర ఓటమికి తానే కారణమని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డురోలర్ గుర్తువల్లే భువనగిరి లోక్‌సభ స్థానంలో తాము ఓడిపోయాం తప్ప వేరే కారణం లేదన్నారు. బూర ఓటమికి నేనే కారణమంటూసోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని చూస్తే చాలా బాధేస్తోందని శేఖర్‌రెడ్డి అన్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక హోటల్‌లో టాయిలెట్‌కు వచ్చిన సందర్భంలో ఎదురుపడ్డారని, అక్కడే ఉండటంతో తనను కాకతాళీయంగా కలిశారని అన్నారు. ఇది రహస్యంగా జరిగింది కాదని, అక్కడ అందరూ ఉన్నారని, ఇదంతా కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే జరిగిందని వివరించారు. తమ మధ్య ఎలాంటి ఇతర సంభాషణ జరగలేదని, ఇలా కలిసి అలా వెళ్లిపోయామని పేర్కొన్నారు. బొమ్మల రామరం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాటల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఈ సంభాషణను వైరల్ చేసిన సైకోను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తానెంటో భువనగిరి ప్రజలకు తెలుసని, ఎంపీ బూర గెలుపుకోసం అందరమూ కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. నామీదే ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. భువనగిరిలో వంద శాతం ఎగిరేది గులాబీ జెండానే అని పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.