పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కోమటిరెడ్డి..

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కోమటిరెడ్డి..

సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి విజయం సాధించిన కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నేతలతో రహస్య మంతనాలు జరిపారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... తమపై జరుగుతోన్న ప్రచారంపై ఘాటుగా స్పందించిన ఆయన... నేను పార్టీ మారడం లేదు.. నేను చనిపోతే నా శవంపై కాంగ్రెస్ జెండానే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కోమటిరెడ్డి... ఈ సారి పీసీసీ పగ్గాలు కోమటిరెడ్డి బ్రదర్స్ కే వస్తాయనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయటానికి కృషి చేస్తాం... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తాము పార్టీలు మారే వ్యక్తులం కాదు.. కాంగ్రెస్ పార్టీ మాకు రాజకీయ జన్మనిచ్చింది.. ఆ పార్టీని వీడే ప్రసక్తేలేదని ప్రకటించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.