జట్టు నుంచి భువనేశ్వర్ ఔట్..!

జట్టు నుంచి భువనేశ్వర్ ఔట్..!

ఐసీసీ వరల్డ్ కప్‌లో ఓవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను.. మరోవైపు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి సెంచరీ చేసి శిఖర్ ధావన్ గాయం కారణంగా మూడు వారాల పాటు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు దూరం కాగా... చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన తర్వాత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా జట్టుకు దూరం కానున్నాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతోన్న భువనేశ్వర్ రెండు - మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ రెండో ఓవర్ వేస్తుండగా తొడ కండరాలు పట్టేశాయి.. దీంతో భువీ స్థానంలో విజయ్ శంకర్, హార్థిక్ పాండ్యాలు బౌలింగ్ చేశారు. మరోవైపు భువనేశ్వర్ గాయాన్ని పరిశీలించిన టీం ఫిజియో వెంటనే మైదానం నుంచి తరలించారు. ఇక, మ్యాచ్ ముగిసిన తర్వాత భువనేశ్వర్‌ గాయం గురించి మాట్లాడిన కోహ్లీ.. భువీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతానికి గాయం తీవ్రంగా లేదు. కానీ.. అతను రెండు లేదా మూడు మ్యాచ్‌లపాటు విశ్రాంతి తీసుకోవల్సిన పరిస్థితి ఉందని వెల్లడించాడు. కాగా, ఇప్పటికే జట్టుకు దూరమైన గబ్బర్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగా... ఇప్పుడు భువీ స్థానంలో షమీని ఆడించే అవకాశం ఉంది. మరోవైపు టోర్నీలో తర్వాత మ్యాచ్‌ని శనివారం రోజు ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది టీమిండియా.