మెగా బ్రదర్స్‌కు బిగ్ షాక్..

మెగా బ్రదర్స్‌కు బిగ్ షాక్..

సార్వత్రిక ఎన్నికల్లో మెగా బ్రదర్స్‌కు భారీ షాక్ తగిలింది... ప్రశ్నిస్తామంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. తమ్ముడి అండగా ఉంటానంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన అన్న నాగబాబుకు ఓటమి తప్పలేదు. అధికారంలోకి రాకపోయినా.. కింగ్ మేకర్ అవుదామనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశలు గండి పడింది. కింగ్ మేకర్ కాదు కదా.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగిన జనసేనానికి నిరాశే మిగిలింది. ఈ రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అటు చివరి నిమిషంలో జనసేన కండువా కప్పుకుని బరిలోకి దిగిన మెగా బ్రదర్ నాగబాబు సైతం నర్సాపురం పార్లమెంట్ స్థానంలో చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి. 

పవన్ కల్యాణ్‌పై గాజువాకలో 16,486 ఓట్ల తేడాతో ఓటమిపాలుకాగా... భీమవరంలో 7,792 ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూశారు. నర్సాపురం లోక్‌సభ బరిలో దిగిన నాగబాబు చిత్తుగా ఓడారు. అక్కడ ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు విజయం సాధించగా... టీడీపీ అభ్యర్థి శివరామరాజు రెండో స్థానంలో నిలిచారు. మొత్తానికి మెగా బ్రదర్స్ ఇద్దరూ ఓటమిపాలు కావడంతో జనసేన శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యారు. మరోవైపు  క్లీన్ పాలిటిక్స్ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని... తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్. ఎన్నికల ఫలితాలపై గురువారం సాయంత్రం మాట్లాడిన ఆయన... తాను ఓడిపోయినా, తన అభ్యర్థులు ఎవరూ గెలవకపోయినా ఇచ్చిన మాట ప్రకారం చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటా, ప్రజాసమస్యల మీద పోరాడతామని స్పష్టం చేశారు.