జైపూర్ ఈడీ ఎదుట రాబర్ట్ వాద్రా.. తోడుగా వచ్చిన ప్రియాంక

జైపూర్ ఈడీ ఎదుట రాబర్ట్ వాద్రా.. తోడుగా వచ్చిన ప్రియాంక

రాజస్థాన్ బికనేర్ జిల్లాలో భూ కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్ వాద్రా మంగళవారం జైపూర్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. రాబర్ట్ వాద్రా వెంట తోడుగా ఆయన భార్య, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈడీ అధికారులు వాద్రా, ఆయన తల్లిని ప్రశ్నించారు. వాద్రా విచారణ దాదాపుగా 3 గంటల పాటు జరగగా, ఆయన తల్లి మౌరిన్ విచారణ సుమారుగా గంటన్నర పాటు సాగింది. వాద్రా ఉదయం పదిన్నర గంటలకు తల్లి మౌరీన్ తో కలిసి ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఒకటిన్నర గంట తర్వాత మౌరీన్ వాద్రా ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 

రాబర్ట్ వాద్రా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు బయటికి వచ్చారు. వాద్రాను భోజన విరామం తర్వాత తిరిగి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వాద్రా భార్య ప్రియాంక గాంధీ వాద్రాను ఈడీ కార్యాలయం దగ్గర వదిలిపెట్టేందుకు వచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య వాద్రా, ప్రియాంక, మౌరీన్ ఒక వాహనంలో జైపూర్ నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ లో ఉన్న ఈడీ కార్యాలయం చేరుకున్నారు.

వాద్రా జైపూర్ లోని ఈడీ ఎదుట మొదటిసారి హాజరయ్యారు. ఇంతకు ముందు ఏజెన్సీ ఢిల్లీలో ఆయనను వరుసగా మూడు రోజులు (ఫిబ్రవరి 7-9) వరకు విచారించింది. మూడు రోజుల్లో దాదాపుగ 24 గంటల పాటు వాద్రాను ఈడీ ప్రశ్నించింది. వాద్రా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని, అక్రమ పద్ధతుల్లో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడంలో ఆయన పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.