ఇండియన్ మార్కెట్ లోకి ‘బికినీ’ ఎయిర్‌లైన్స్ !

ఇండియన్ మార్కెట్ లోకి ‘బికినీ’ ఎయిర్‌లైన్స్ !

భారత విమానయాన మార్కెట్ లోకి మరో విదేశీ సంస్థ ప్రవేశిస్తోంది. వియత్నాంలో బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన వియత్ జెట్ కంపెనీ సేవలు త్వరలోనే ఇండియాలో కూడా ప్రారంభం కానున్నాయి. వియత్నాంకు చెందిన 'వియత్‌జెట్ ఎయిర్' సంస్థ...'బికినీ ఎయిర్‌లైన్స్‌'గా చాలా ఫేమస్ ఈ సంస్థ ఎయిర్ హోస్టెస్ లు బికినీ ధరించి ప్రయాణికులకు ఆహ్వానం పలకడం అనే అంశం ఒకప్పుడు వియత్నాంలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ సంస్థే భారత్‌లోనూ సర్వీసులను ప్రారంభిస్తోంది. డిసెంబరు 6 నుంచి హోచి మిన్-ఢిల్లీ, హనోయ్-ఢిల్లీ రూట్లో విమానాలను నడుపుతామని ప్రకటించింది.

ఇండియా‌లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చింది వియత్‌జెట్. రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. 'గోల్డెన్ డేస్' పేరిట ఆగస్టు 20-22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. హోచి మిన్-న్యూఢిల్లీ రూట్‌లో వారానికి నాలుగు రోజులు విమానాలను నడపనుంది. సోమ, బుధ, శుక్ర, ఆది వారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 2011లో వియత్‌జెట్ పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో  సిబ్బంది  బికినీలు ధరించి  ఉంటారు. అలాగే ప్రతి ఏటా ఈ సంస్థ విడుదల చేసే క్యాలెండర్‌లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీలు ధరించివుంటారు. దీనిని వియత్ ఎయిర్ లైన్స్ అంటే గుర్తు పట్టరేమో కానీ బికినీ ఎయిర్ లైన్స్ అంటే గుర్తు పట్టని వారే ఉండరు.