100 మిలియన్ డాలర్ల నిధుల కోసం బీరా వేట

100 మిలియన్ డాలర్ల నిధుల కోసం బీరా వేట

బీరా 91 బ్రాండ్ క్రాఫ్ట్ బీర్ తయారీ సంస్థ బీ9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 100 మిలియన్ డాలర్ల నిధుల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. సంస్థ విస్తరణ ప్రణాళికల కోసం ఈ నిధులు వినియోగించనున్నట్టు తెలిసింది. ఇదే సంస్థ తయారు చేస్తున్న సరికొత్త మాస్ మార్కెట్ బీర్ బ్రాండ్ 'బూమ్' అమ్మకాలు పెంచడం వీటిలో ఒకటి అని చెబుతున్నారు. 100 మిలియన్ డాలర్లలో 20 మిలియన్ డాలర్లను కంపెనీలో ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారుల నుంచి సేకరిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీకి చెందిన బీ9 బెవరేజెస్ 4.3 మిలియన్ డాలర్లను సిక్స్త్ సెన్స్ వెంచర్స్ నుంచి పొందింది. రాబోయే మూడేళ్లలో భారత్ లో వ్యాపారాన్ని ఐదు రెట్లు చేసేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు కంపెనీ గతంలో చెప్పింది. 

బీ9ని అంకుర్ జైన్ 2015లో స్థాపించారు. బీరా 91 నగర వినియోగదారులు ఇష్టపడే మైల్డ్ బీర్ల తయారీపై దృష్టి పెట్టింది. అయితే క్రాఫ్ట్ బీర్ల వ్యాపార సామర్థ్యం భారత్ లో తక్కువగానే ఉంది. దేశంలోని మొత్తం బీర్ వినియోగంలో క్రాఫ్ట్ బీర్లు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 2017లో బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం కేవలం 4.7 బిలియన్ లీటర్లు మాత్రమే. అమెరికాలో బీర్ అమ్మకాల్లో క్రాఫ్ట్ బీర్ ల వాటా 12 శాతంగా ఉంది. అయితే కొన్నేళ్లలో భారత్ లో బీరా టాప్ రెండు బీర్ బ్రాండ్లలో నిలిచే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.