హరీష్‌రావుకు శుభాకాంక్షల వెల్లువ.. ఛాలెంజ్‌ విసిరిన ఎంపీ సంతోష్‌

హరీష్‌రావుకు శుభాకాంక్షల వెల్లువ.. ఛాలెంజ్‌ విసిరిన ఎంపీ సంతోష్‌

లీడర్‌ అంటే ప్రజల్లోనుంచి పుట్టుక రావాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి.. కష్టం వస్తే నేను ఉన్నానంటూ భరోసా ఇవ్వాలి.. అనుకోని సంఘటన జరిగితే క్షణాల్లో అక్కడ వాలిపోవాలి.. ముఖ్యంగా మా నేత ఉన్నాడు అనే ధైర్యం ఇవ్వాలి.. అలాంటి అన్ని లక్షణాలున్న నాయకుడు మంత్రి హరీష్‌రావు... ఆయన ప్రజలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాడని చెప్పడానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గం తీసుకుంటే చాలు.. హారీష్ ప్రతీ ఎన్నికల్లో తన మెజార్టీనే పెంచుకుంటూనే ఉన్నారు.. ఆయన మెజార్టీ రికార్డు రాష్ట్రస్థాయిని దాటి.. జాతీయ స్థాయికి చేరింది.. ఊళ్లకు ఊళ్లు.. వార్డులు.. ఇలా హరీష్‌నే ఎన్నుకుందామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయంటే.. ఆయనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏంటో అర్థం చేసుకోవచ్చు... ఆ జనహృదయ నేత తన్నీరు హరీష్‌రావు పుట్టినరోజు నేడు.. 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఆ నేత.. ఈ సందర్భంగా హరీష్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి..

కరోనా సమయంలో ఈ సారి జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మంత్రి హరీష్‌రావు.. నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.. కానీ, ఎవరూ రావొద్దు.. జన్మదిన వేడులకను దూరంగా ఉంటున్నాని పేర్కొన్నారు. ఇక, సోషల్ మీడియా వేదికగా మంత్రి హరీష్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎంపీ కవిత.. హరీష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.. హ్యాపీ బర్త్‌డే బావా అంటూ కేటీఆర్, కవిత విషెష్ చెప్పగా... ఎంపీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాల్సిందిగా హరీష్‌ను కోరిన సంతోష్.. పుట్టినరోజును పురస్కరించుకుని మరో మూడు మొక్కలకు జీవితాన్నిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు పెద్దఎత్తున మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.