హ్యాపీ బి-డే: జ‌య‌ప్ర‌దం @ 56

హ్యాపీ బి-డే: జ‌య‌ప్ర‌దం @ 56

అందాల క‌థానాయిక ల‌లితారాణి అలియాస్ జ‌య‌ప్ర‌ద(56) ఐదు ద‌శాబ్ధాల ప్ర‌స్థానం గురించి తెలిసిందే. 3 ఏప్రిల్ 1962 లో జ‌న్మించిన జ‌య‌ప్ర‌ద రాజ‌మండ్రిలో ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించి, అటుపై ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ల్ల సినీరంగంలో న‌టిగా ఆరంగేట్రం చేశారు. 1962 -2018 వ‌ర‌కూ జీవ‌న ప‌య‌నంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు... జ‌యాప‌జ‌యాలు. సినీన‌టిగా, రాజ‌కీయ నాయ‌కురాలిగా ప్ర‌స్తుతం లైఫ్‌ని సాగిస్తున్నారు. డాక్ట‌ర్ అవ్వాల‌నుకుని యాక్ట‌ర్ అయిన వారి జాబితాలో జ‌య‌ప్ర‌ద పేరు కూడా ఉంది. ఏడో ఏట నుంచే నాట్యంలో రాణించిన ల‌లితారాణి అనూహ్యంగా సినీన‌టి అయ్యారు. 14 వ‌య‌సులోనే స్కూల్ వేడుక‌ల్లో త‌న నాట్యం చూసిన న‌టుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి, 1976లో `భూమి` కోసం అనే చిత్రంలో ఓ పాట‌లో న‌ర్తించే అవ‌కాశం క‌ల్పించారు. ఆ త‌ర‌వాత పేరు జ‌య‌ప్ర‌ద‌గా మార్చింది ఆయ‌నే. తొలి అవ‌కాశం త‌ర‌వాత బాల‌న‌టిగా రాణించిన జ‌య‌ప్ర‌ద సినీకెరీర్ ప‌రంగా ఏనాడూ వెనుదిరిగి చూసిందే లేదు. ఇప్ప‌టికి దాదాపు 300 పైగా చిత్రాల్లో న‌టించారు. ఇంకా న‌టిస్తూనే ఉన్నారు. పాఠశాల తర్వాత రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో విద్యాబ్యాసం పూర్తి చేశాక, న‌ట‌న‌లోకి ప్ర‌వేశించారు. సినీకెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే, 1986 జూన్ 22 న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడారు. భూమి కోసం, సీతా కల్యాణం, మాంగల్యానికి మరో ముడి, అంతులేని కథ, సిరి సిరి మువ్వ, అడవి రాముడు, యమగోల, రంగూన్ రౌడీ, దొంగలకు సవాల్, శ్రీవారి ముచ్చట్లు, ఊరికి మొనగాడు, దేవత, సాగర సంగమం, ముందడుగు, మేఘసందేశం, అమరజీవి, పులి - బెబ్బులి, తాండ్ర పాపారాయుడు, సింహాసనం, వేట, సంసారం, జీవిత ఖైదీ, మహారధి వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో నటించారు. వీటిలో జ‌య‌ప్ర‌ద న‌టించిన `సాగ‌ర‌సంగ‌మం` జాతీయ అవార్డు సినిమాగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ చిత్రంలో నాట్య‌నాయిక‌గా జ‌య‌ప్ర‌ద విన్యాసాలు ఇప్ప‌టికీ ఓ గ్రంధంలా ప‌రిశీలిస్తుంటారు న‌వ‌త‌రం న‌టీమ‌ణులు. నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరిన జ‌య‌ప్ర‌ద‌, అటుపై చంద్రబాబు నాయుడు స‌మ‌క్షంలో మహిళా విభాగమునకు అధ్యక్షురాలిగా ప‌ని చేశారు. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నిక‌య్యారు. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13 న లోక్ సభకు ఎన్నికైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌య‌ప్ర‌ద తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి న‌టిస్తున్నారు. తాను న‌టించిన సాయిబాబా సినిమా రిలీజ్‌కి రెడీ కానుంది. నేడు జ‌య‌ప్ర‌ద పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.