గుజరాత్ కేంద్రంగా.. బిట్ కాయిన్ భారీ స్కామ్

గుజరాత్ కేంద్రంగా.. బిట్ కాయిన్ భారీ స్కామ్

గుజరాత్‌ కేంద్రంగా సాగిన బిట్‌ కాయిన్ కుంభకోణంపై ఇపుడు అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. బ్రిటన్ కేంద్రం జరిగిన ఈ స్కామ్‌లో మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు సుమారు 410 కోట్ల డాలర్లు మన కరెన్సీల్లో సుమారు రూ. 29,000 కోట్లు నష్టపోయారు. ఏకంగా కంపెనీనే మూత పడటంతో  తమ బిట్‌ కాయిన్ల వ్యవహారం అంతర్జాతీయంగా సంచలనం రేపింది. బిట్ కనెక్ట్ అనే కంపెనీ  ఈ కుంభకోణానికి కేంద్రం బిందువు కాగా.. ఇందులో  ప్రమోటర్ అయిన ఓ గుజరాతీ మనదేశలో చెలరేగిపోయాడు. వేల కోట్ల రూపాయలను బిట్ కాయిన్స్ లోకి మళ్ళించాడు. నెలకు 40 శాతం చొప్పున వడ్డీ వస్తుందని చెప్పడంతో ఇంటితో పాటు నగలను కూడా అమ్మి చాలా మంది ఈ బిట్ కాయిన్ కంపెనీకి ముట్టచెప్పినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిట్ కాయిన్ వ్యూహం బెడికొట్టడంతో... దీన్ని ప్రమోట్ చేసి... దీన్ని ఆసరగా లబ్ది పొందాలని చూసినవారి మధ్య గొడవలు మొదలయ్యాయి. వ్యవహారం పోలీస్‌ స్టేషన్ల దాకా వెళ్ళింది. వ్యవహారం వందల కోట్లలో ఉండేసరికి న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. 

రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండటంతో వ్యవహారం జాతీయ మీడియాకు చేరింది.  ఈ గోల్ మాల్ అమెరికాకు కూడా చేరింది. అనూహ్య స్థాయిలో వడ్డీ ఆఫర్ చేస్తూ ఇన్వస్టర్లను మోసం చేస్తున్న ఈ చెయిన్ మార్కెటింగ్ కంపెనీనికి  టెక్సాస్ స్టేట్ సెక్యూరిటీస్ బోర్డ్ నిషేధించింది. దీంతో ఆ సంస్థ ఖేల్‌ ఖతం అయింది. మరి ఇన్వెస్టర్ల సంగతి? ఇంతకూ మన దేశంలో ఏం జరిగింది.బ్రిటన్ లోని యాష్ ఫోర్ట్ లోని ద పనోరమా పార్క్ స్ర్టీట్ అడ్రస్ తో బిట్ కనెక్ట్ అనే కంపెనీ 2016 ఆరంభంలో ఏర్పడింది. బిట్ కాయిన్ వ్యాపారం మెలమెల్లగా ఊపందుకుంటున్న సమయం అది. ఇందులో డైరెక్టర్ గా భారత్ కు చెందిన సతీష్‌ కుంభాని డైరెక్టర్. 2011లో  గ్రీన్విచ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన సతీష్‌ కొన్నాళ్ళు రాయల్ మెయిల్ లో పనిచేశారు. తరవాత పలు సంస్థల్లో పనిచేస్తూ... బిట్ కనెక్ట్ తో కనెక్ట్ అయ్యాడు. కంపెనీలో చేరాక భారత్ పై దృష్టి సారించాడు. ముఖ్యంగా తన సొంత రాష్ట్రం గుజరాత్ లో కొంత మందితో కలిసి సూరత్ కేంద్రం బిట్ కాయిన్ లో పెట్టుబడిని ప్రోత్సహించాడు.  నేరుగా బిట్ కాయిన్ పెట్టాల్సిన పనిలేదని... నిధులు సమకూర్చితే తాము బిట్ కాయిన్ లో పెట్టుబడి పెడతామని... రోజు ఒక శాతం వడ్డీ ఇస్తామని ఆఫర్ చేశాడు. అలాగే నెలకు 40 శాతం కూడా వడ్డీని ఆఫర్ చేసినట్లు తన విచారణలో తేలినట్లు టెక్సాస్ స్టేట్ సెక్యూరిటీస్ బోర్డు పేర్కొంది.

నోట్ల రద్దుతో బంపర్ ఆఫర్ 

కంపెనీ పెట్టి ఇంకా ఏడాది కూడా పూర్తికాకనే... బిట్ కనెక్ట్ కు భారత ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన నోట్ల రద్దు ఓ వరంలా మారింది. గుజరాత్ లోని నల్లధన కుబేరులందరూ... తమ సొమ్మును తెల్లగా మార్చుకునేందుకు మార్గాలు వెతికారు.  అపుడే ఈ బిట్ కనెక్ట్ ఆఫర్ జనానికి కూడా కనెక్ట్ అయింది. పలువురు రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగారు. దీంతో ఏడాదిలో కొన్ని వేల కోట్లను సమీకరించి విదేశాలకు తరలించారు. నోట్లరద్దు సమయంలో కేవలం ఒక్క సూరత్ కేంద్రంగానే రూ. 4,500 కోట్లు సమకూరినట్లు సమాచారం. ఈ బంపర్ ఆఫర్ చూసిన చాలా మంది ఇల్లు అమ్మి, నగలు అమ్మి కూడా సొమ్ము తరలించారు. ఇలా నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బూట్ కాయిన్ బూమ్ వచ్చింది. బిట్ కాయిన్ ధర లక్షల్లోకి మారింది. అపుడు అమ్ముకుని బయటపడినవారి సంగతి సరే..కాని అందులో కొనసాగినవారు నిండా మునిగిపోయారు. ఎందుకంటే బిట్ కాయిన్ పై అనేక దేశాలు నిషేధం విధించడంతో మెలమెల్లగా బిట్ కాయిన్ విలువ క్షీణిస్తూ వచ్చింది. ఒక చెయిన్ మార్కెటింగ్ కంపెనీలా నిధులు సమీకరిస్తుందని భావించిన టెక్సాస్ స్టేట్ సెక్యూరిటీస్ బోర్డ్...2018 జనవరి 4వ తేదీన బిట్ కనెక్ట్ ను నిషేధించింది. దీంతో 4.1 బిలయన్ డాలర్ల కంపెనీ జీరో అయిపోయింది. అంతే ఇన్వెస్టర్లలో కలకలం... మనదేశంలో ఏం జరిగిందంటే... రూ.22,000 కోట్లకు ఎసరు? మనదేశంలో  3 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.22,000 కోట్లకు పైగా)  నష్టపోయిరట్లు అంతర్జాతీయ వార్త సంస్థ బ్లూమ్‌ బర్గ్ పేర్కొంది.  బారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిషేధించినా చాప కింద నీరులా సాగుతున్న బిట్ కాయిన్  సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కలకలం రేపుతోంది. వస్త్రాలు, వజ్రాల  వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉన్న  సూరత్ ఈ క్రిప్టోకరెన్సీ స్కామ్ కి కూడా ప్రధాన కేంద్రంగా మారిదన్న వార్తలతో ఫైనాన్సియల్ మార్కెట్ పండితులు కూడా ఆశ్చర్య పోతున్నారు.

 కిడ్నాప్ లు కూడా...

ఈ భారీ కుంభకోణం గుజరాత్ లో బయటపడిన విధానం ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది.  శైలేష్ భట్  ఓ బిల్డర్. తనను, తన భాగస్వామి కిరీట్ పలాడియాను అమ్రేలీ పోలీసులు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే నలియన్ కొటాడియా కిడ్నాప్ చేసి రూ. 9 కోట్ల విలువైన బిట్ కాయిన్స్ తీసుకున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టాడు. కేసు విచారించగా ఇందులో  పోలీసుల పాత్ర నిజమని తేలడంతో  అమ్రేలీ ఎస్పీ సహా 9 మంది పోలీసులపై వేటు పడింది.  పలాడియా, ఎస్పీ, క్రైం బ్రాంచ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో మధ్యవర్తిని అరెస్ట్ చేశారు. ఏడుగురు కానిస్టేబుళ్లు పరారీలో ఉన్నారు. అండర్ గ్రౌండ్ కి వెళ్లిన బీజేపీ నేత కొటాడియా తనకే సంబంధం లేదంటూ యూట్యూబ్ లో వీడియో పెట్టాడు. కాని ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఫిర్యాదు చేసిన శైలేష్ భట్ కూడా ఓ కిలాడీగా తేలడం. బిట్ కాయిన్ వ్యాపారంపై పరిశోధన ప్రారంభించిన సీఐడీ పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. సతీష్ కుంభానీ (బ్రిటన్ లో కంపెనీ పెట్టిన వ్యక్తి)  సూరత్ లో బిట్ కనెక్ట్ కు ఓ బ్రాంచి ప్రారంభించాడు. కాని ఇక్కడ ఎలాంటి రిజస్ట్రేషన్ లేదా సంస్థ లేదు. కేవలం నిధులు మళ్ళించడమే వీరి పని. ఇందులో శైలేష్ భట్ భట్ రూ.2 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. కొందరు సూరత్ వ్యాపారులు, గుజరాత్ వ్యాపారవేత్తలు కూడా తమ నల్లధనాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చుకోసాగారు. ఆకర్షణీయమైన వడ్డీ కూడా ఇస్తామనడంతో వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది.  పెద్ద నోట్ల రద్దుతో బిట్ కనెక్ట్ ఒక్కసారిగా దూసుకుపోయింది. వేలాది కోట్ల రూపాయలు సూరత్ లోకి ప్రవహించాయి. గుజరాత్ నలుమూలల నుంచి నల్లధనం పోగేసిన వారంతా తమ డబ్బుని బిట్ కాయిన్లుగా మార్చుకున్నారు. కొత్తవారిని చేరిస్తే 40% వడ్డీ అని కుంభానీ ప్రకటించడంతో ఎక్కడెక్కడివారు తమ ఇళ్లూ, స్థలాలు, పొలాలు అమ్ముకొని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారు. కుంభానీ వ్యాపారం అమెరికాకి సైతం పాకింది. అక్కడి గుజరాతీలు తెగ పెట్టుబడులు పెట్టారు. సుమారుగా 3.5 బిలియన్ డాలర్ల డబ్బు వచ్చి పడింది.  కొసరు కోసం...శైలేష్ భట్ తన 2 కోట్లలో రూ.1.80 కోట్లు వెనక్కి తెచ్చుకోగలిగాడు. అంతటి సరిపుచ్చుకుని ఉంటే ఈ గొడవంతా జరిగే కాదు. పోయింది రూ. 20 లక్షలేగా..కాని ఈ వ్యాపారం తెలుసుకున్న భట్...  మరో 8 మందితో కలిసి జనవరిలో బిట్ కనెక్ట్ లో ఆఫీస్ బాయ్ పీయూష్ సవాలియాను కిడ్నాప్ చేశాడు. ఫిబ్రవరి 1న అదే ఆఫీసులో అడ్మినిస్ట్రేటర్ ధవల్ మవానీని కిడ్నాప్ చేసి రూ.131 కోట్ల విలువైన 2,256 బిట్ కాయిన్లు, రూ.9.64 కోట్లు చేసే 11,000 లైట్ కాయిన్లు, రూ.14.50 కోట్ల నగదు కలుపుకొని మొత్తం రూ.155 కోట్లు వసూలు చేశాడు. ఇందులో 700  బిట్ కాయిన్లు తను తీసుకొని మిగతాది 9 మంది సమానంగా పంచుకొన్నారు. తన కిడ్నాపింగ్ లు బయట పడకూడదని తనే రివర్స్ కేసు పెట్టాడు. తను కిడ్నాప్ కాలేదని చెప్పమంటూ పీయూష్ సవాలియాకు రూ.60 లక్షలు ముట్టజెప్పాడు.

డామిట్ కథ అడ్డం తిరిగింది...

కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు సవాలియాను ప్రశ్నించడంతో డొంకంతా కదిలింది. సవాలియా నుంచి రూ.20 లక్షలు, భట్ నుంచి రూ.8.58 కోట్ల విలువైన 152 బిట్ కాయిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో భట్, అతనికి సహకరించిన 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు దిలీప్ కనానీ, శైలేష్ భట్ సోదరుని కొడుకు నికుంజ్ భట్ ని అరెస్ట్ చేశారు. భట్, మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు బిట్ కనెక్ట్, నెక్సా కాయిన్ అనే కంపెనీల్లో దేశవిదేశాల్లోని గుజరాతీ వ్యాపారులు భారీగా పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. ఇవి కాకుండా మరో ఐదారు వర్చువల్ కరెన్సీ కంపెనీలు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది.నత్తనడకలా...ఈ మొత్తం వ్యవహారంపై విచారణ సజావుగా సాగడం లేదని, ఈ వ్యాపారంలో కోట్లు గుమ్మరించినవారి పేర్లు బయటికి రావడం లేదని మీడియా అంటోంది. పలువురు రాజకీయ నేతల ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు జరగాల్సినంత స్పీడుగా సాగడం లేదు. పెద్దల నుంచి ఒత్తిడే దీనికి కారణమని మీడియా అంటోంది.