శబరిమలలో అరెస్ట్ లకు నిరసనగా బీజేపీ దీక్ష 

శబరిమలలో అరెస్ట్ లకు నిరసనగా బీజేపీ దీక్ష 

శబరిమలలో భక్తుల అరెస్ట్ కు నిరసనగా బీజేపీ కార్యకర్తలు కేరళ డీజీపీ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టింది.  కేరళ ప్రభుత్వం హిందువుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని బీజేపీ ఆరోపించింది . సీపీఐ(ఎం) , ఎల్డీఎఫ్ కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. భక్తుల అరెస్ట్ లను నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రంల్లోని ఎస్పీ కార్యాలయాల ఎదుట ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.  రూలింగ్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీధరన్ పిల్లయ్ పార్టీ కార్యకర్తలకు తెలిపారు.  నిరసన కార్యక్రమంలో సీనియర్ మార్కిస్ట్ నేత ఎం.ఎం.లారెన్స్ మనుమడు కూడా పాల్గొన్నారు. ఇప్పటివరకు శబరిమల కేసులో 3,500 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. 529కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా .. అక్టోబర్ 27న జరిగిన సమావేశంలో కేరళలో భక్తులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అరెస్ట్ లు ఆపకపోతే... ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని హెచ్చరించారు. దీంతో బీజేపీ, కేరళ అధికార పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. షా వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తీర్పును సైతం వ్యతిరేకించే విధంగా ఉన్నాయని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.