నా శాపం వల్లే హేమంత్ కర్కరే మరణించారు

 నా శాపం వల్లే హేమంత్ కర్కరే మరణించారు

భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముంబయి యాంటీ టెర్రరిస్ట్‌ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్‌ 26/11 దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. హేమంత్ కర్కరే తన శాపం వల్లనే ఉగ్రవాదుల చేతిలో చనిపోయారని భోపాల్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు. దీంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొంది అశోక చక్ర పురస్కారం పొందిన హేమంత్ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శలు మొదలయ్యాయి. ‘‘నన్ను ఆయన తీవ్రంగా వేధించారు. దీంతో నేను ఆయన్ని శపించాను. అప్పటి నుంచి ఆయనకు అశుభ ఘడియలు మొదలయ్యాయి. అనంతరం ఆయన ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు’’ అని ప్రజ్ఞా ఠాకూర్‌ అన్నారు.

ఇదిలా ఉంటే 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో భాగంగా సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను ముంబై ఏటీఎస్ అరెస్టు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హేమంత్‌ కర్కరే.. పేలుళ్లలో వాడిన ద్విచక్రవాహనం ప్రజ్ఞా పేరు మీదే నమోదై ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. అయితే కేసు విచారణలో భాగంగా ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తనను కస్టడీలో వేధింపులకు గురిచేశారని సాధ్వీ ప్రగ్యా ఆరోపించారు. తనపై వేధింపులకు పాల్పడిన కర్కరే సర్వ నాశనం అవ్వాలని శపించాను. సరిగ్గా అరెస్టు చేసిన 45 రోజులకు ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హేమంత్ కర్కరే చనిపోయాడని ప్రగ్యా అన్నారు. 2016లో ఆమెకు ఎన్‌ఐఏ క్లీన్‌ చిట్ ఇచ్చినప్పటికీ కేసును కొట్టి వేయడానికి కోర్టు మాత్రం అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమె ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న భోపాల్‌ నుంచి పోటీ చేస్తున్నారు.