బెంగాల్‌ ఎన్నికలు.. బీజేపీ భారీ టార్గెట్..!

బెంగాల్‌ ఎన్నికలు.. బీజేపీ భారీ టార్గెట్..!

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ - మేలో శాసన సభ ఎన్నికలు జరగనుంది.. అయితే, బెంగాల్‌లో అధికార పగ్గాలు అందుకోవాలన్న ప్లాన్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ.. భారీ టార్గెట్‌నే పెట్టుకుంది.. ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. బీజేపీ పట్ల ప్రజల్లో మరింత సానుకూలతను రాబట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. జనవరి నుంచి తరచుగా రాష్ట్రంలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి నెలలో ఒక వారం చొప్పున పశ్చిమబెంగాల్‌లోనే మకాం వేయాలనేది ఆయన ఆలోచన. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమిత్ షా రాష్ట్రంలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా మరో రోజు కూడా పర్యటించేందుకు అనుకూలమైన తేదీని అమిత్ షా కార్యాలయం ఖరారు చేయవలసి ఉందని చెబుతున్నారు. సుభాష్‌ చంద్రబోస్ జయంతి నాడు కూడా అమిత్‌షా వెస్ట్ బెంగాల్‌లో పర్యటించే అవకాశం ఉంది.

అమిత్ షా రావడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని మమత బెనర్జీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శాసన సభ ఎన్నికల వరకు ప్రతి నెల ఒక వారం పాటు తాను రాష్ట్రంలో పర్యటిస్తానని అమిత్ షా తమకు చెప్పారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆయన పర్యటన వల్ల మరొక ఉపయోగం కూడా ఉందని, కొంత కాలంగా అణచివేతకు గురవుతున్న తమ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తుందని రాష్ట్ర బీజేపీ ఎంపీ ఒకరు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో 294 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 200 స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 18 స్థానాలు లభించడంతో ఆ పార్టీ మరింత ఉత్సాహంగా అధికార పార్టీతో పోరాడుతోంది. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి మరి కొంతమంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది.