ఏడాదిన్నరలో ఎంతో మార్పు..! బీజేపీ ప్రభావాన్ని కోల్పోతోందా..?

ఏడాదిన్నరలో ఎంతో మార్పు..! బీజేపీ ప్రభావాన్ని కోల్పోతోందా..?

ఏ ఎన్నికలకైనా తమకు ఎదురేలేదు అనే రేంజ్‌లో దూసుకెళ్లిన భారతీయ జనతా పార్టీలో ఏడాదిన్నరలో ఎన్నో మార్పులు చూడాల్సి వచ్చింది. దీంతో, రాజకీయంగా బీజేపీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోందా ? అనే చర్చ మొదలైంది.. ఓసారి పరిశీలిస్తే ఇండియా మ్యాప్ పొలిటికల్ కలర్ మారిపోతోంది. కాషాయం రాష్ట్రాలు రంగు మారుతూ వస్తోంది. 2017లో దేశంలోని 71 శాతం ప్రాంతంలో అధికారాన్ని చేజెక్కించుకున్న బీజేపీ .. ప్రస్తుతం 35శాతం ప్రాంతానికి పరిమితమైంది. 2018 మార్చి నాటికి 21 రాష్ట్రాలకు తన అధికారాన్ని విస్తరించింన బీజేపీ.. 2019 డిసెంబర్ నాటికి 16 రాష్ట్రాలకు పరిమితమైంది. ఇటీవలే మహారాష్ట్రలోనూ అధికారం కోల్పోయిన బీజేపీ.., తాజాగా జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్‌ను కూడా చేజార్చుకుంది.

2017కు ముందు దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఆ పార్టీ.. తర్వాత జరుగుతూ వస్తున్న శాసనసభ ఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకుంటోంది. దేశంలో ప్రస్తుతం కమలనాథులు సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు పది మాత్రమే. మిగిలిన చోట్ల మిత్ర పక్షాలతో అధికారం చెలాయిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వరుసగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానా మాత్రమే. మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. మహారాష్ట్రలో శివసేనతో, పంజాబ్‌లో అకాళీదళ్‌తో కలిసి అధికారం చేపట్టారు. అనంతరం జరిగిన జమ్మూకాశ్మీర్‌ ఎన్నికల్లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌తో, ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనూ అక్కడి స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. 2016లో బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి దారుణ పరాజయం మూటకట్టుకున్న కమలనాథులు.. తర్వాత ఆ కూటమిని చీల్చి నితిశ్‌ను తమ వైపునకు తిప్పుకున్నారు. దీంతో అక్కడ బీజేపీతో కలిసి ఆయన అధికారాన్ని పంచుకుంటున్నారు. ఇక గోవాలో తమకు అవకాశం లేకున్నా బాహాటంగానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విమర్శల పాలైంది.

 2017 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రాగా.. గతేడాది జరిగిన కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటములు మూటగట్టుకుంది. కర్ణాటకలో మెజారిటీ లేకున్నా అధికారం ఏర్పాటుచేయాలని భావించి విమర్శలపాలైంది. కానీ ఏడాది తిరుగకముందే అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టింది. జమ్మూకాశ్మీర్‌లో పీడీపీతో తెగదెంపులు చేసుకుని అక్కడ గవర్నర్‌ పాలన విధించింది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నా.. ఒడిషా, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి మింగుడుపడలేదు.  జాతీయవాదంతో ప్రచారం నిర్వహించినా.. హర్యానాలో మెజారిటీ మార్కు చేరుకోలేదు. కానీ జననాయక్‌ జనతా పార్టీ-జేజేపీ అధ్యక్షుడు దుశ్యంత్‌ చౌతాలా సాయంతో అక్కడ గట్టెక్కింది. ఇక మహారాష్ట్రలో విజయం నల్లేరు మీద నడకే అనుకున్నా అక్కడా అనుకున్న స్థానాలు రాలేదు. దీంతో అప్పటిదాకా అణిగిమణిగి ఉన్న శివసేన.. ఒక్కసారిగా జూలు విదిల్చింది. కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ఆకలి చావులు, మూకదాడులు, అటవీ చట్టాలు వంటి స్థానిక సమస్యలతో  విసిగిపోయి ఉన్న అక్కడి ప్రజలు కాంగ్రెస్-జేఎంఎం కూటమికి పట్టం కట్టారు. దీంతో జార్ఖండ్ కూడా బీజేపీ ఖాతా నుంచి చేజారిపోయింది. మొత్తంమీద.. 2018 మార్చి నాటికి 21 రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ.... ఆ తర్వాత కీలకమైన రాష్ట్రాల్లో పట్టుకోల్పోతూ వస్తోంది. ప్రస్తుతం బీజేపీ, దాని మిత్రపక్షాల చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, బీహర్‌ మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో గానీ, తమిళనాడులో గానీ ఆ పార్టీకి కనీస ఓటు బ్యాంకు కూడా ఇప్పటికీ లేదు. తాజాగా జార్ఖండ్ ఫలితాలతో మరో షాక్ తగిలింది.