విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం

విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలయ్యామని.. తక్కువ మార్కులొచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపెడు తున్నాయి. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పందించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తరువాత విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. బోర్డు చేసిన తప్పిదాల వల్ల విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు వచ్చిన మార్కులకు పొంతనలేదని ఆరోపించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ విద్యార్థుల పట్ల మాట్లాడిన తీరు అభ్యంతరంగా ఉందని అన్నారు. బోర్డు చేసిన తప్పిదాల దృష్ట్యా విద్యార్థులకు ఉచితంగా జవాబు పత్రాలను అందజేయాలని డిమాండ్ చేస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. ఈఘటనలపై ప్రభుత్వం రేపటి లోగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఇంటర్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని తెలిపారు. చనిపోయిన విద్యార్ధుల తల్లిదండ్రులకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అన్నారు. ఇప్పటి వరకు సీఎం, విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు.

మరోవైపు ఇంటర్ మార్కుల జాబితాలో నెలకొన్న అవకతవకలపై విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు ముందు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ మెమోలో మార్కులు తారుమారయ్యాయని.. పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ వారు ఆరోపించారు. ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేనివాళ్లతో పేపర్లు దిద్దించారని అనుమానం వ్యక్తం చేశారు.