అంబర్ పేటలో అశాంతిని సృష్టించింది వాళ్లే..

అంబర్ పేటలో అశాంతిని సృష్టించింది వాళ్లే..

ప్రశాంతంగా ఉన్న అంబర్ పేటలో ఎంఐఎం పార్టీ అశాంతిని సృష్టించిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని ప్రశాంతతను, మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పోలీసులు అకారణంగా యువకుల మీద అక్ర కేసులు నమోదు చేశారని అన్నారు. అక్కడ లేని మసీదు ఉందని ఎంఐఎం నేతలు అలజడులు రేపుతున్నారన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆ వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వం స్థల యజమానులకు డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకున్నారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరికీ ఇబ్బంది జరగకుండా స్థలం కోల్పోయిన వాళ్ళకందరికి మార్కెట్ రేటు కంటే ఎక్కువ పారితోషకం ఇచ్చామన్నారు. మొత్తం 280 మందికి గాను ఇప్పటివరకు 170 మందికి నష్టపరిహారం చెల్లించామని వివాదాస్పద స్థల యజమానులుకు కూడా నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఏడాది క్రితం ఆ స్థల యజమానులకు ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు. అంబర్ పేటలో ఉద్రిక్తతకు మజ్లీస్, పోలీసు, జీహెచ్ఎంసీనే కారణమని కిషన్ రెడ్డి అన్నారు.