హామీలపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ చర్చకు సిద్ధమా?

హామీలపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ చర్చకు సిద్ధమా?

హామీలపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు బీజేపీ నేత కిషన్‌రెడ్డి... అమలు సాధ్యం కాని హామీలిస్తూ ఆ రెండు పార్టీలు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డ ఆయన... రాష్ట్రన్ని ఆర్థికంగా అదోగతి పాలు చేసేలా ఉన్నాయన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో లక్ష 70 వేల కోట్లు అప్పులు కేసీఆర్ తెచ్చారని... రోడ్లకు డబ్బులు లేవు, ఫీరియింబర్స్ మెంట్ చెల్లించడం లేదు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది, ఒక్క కాళేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడం లేదు, విద్యుత్ శాఖ అప్పుల మయం అయింది, పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. మద్యానికి బానిసై ఎన్ని వేల మంది చనిపోయారో చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి... ఈ ప్రభుత్వం రెండు పనులు పెట్టుకొంది... ఒకటి అప్పు చేయడం, రెండోది మద్యాన్ని అమ్మడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు... ప్రజల పైన కాంగ్రెస్ కి నమ్మకం లేదన్న బీజేపీ నేత... కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికల హామీలతో... సాధ్యంకాని కూటమిలతో దింపుడుకళ్లం ఆశతో ఉందన్నారు. హామీల అమలులో ఎందుకు విపలమయ్యారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి... హామీలపై కాంగ్రెస్, టీఆర్ఎస్ బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. ఓట్లు, సీట్లు, అధికారం తప్ప ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధిలేదన్నారు.