'సేవకులు కావాలా.. కుటుంబాలకు బానిసలు కావాలా'

'సేవకులు కావాలా..  కుటుంబాలకు బానిసలు కావాలా'

సేవకులు కావాలా లేక కుటుంబాలకు బానిసలు కావాలా? అని ప్రజలు ఆలోచించాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణాలో కేసీఆర్ కి ఓటేస్తే ఎవరు పాలన చేస్తున్నారో అందరికి తెలుసన్నారు. టీఆర్ఎస్ కి ఓటేస్తే గులాంగిరికి ఓటేసినట్టే. టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కుటుంబానికి గులాంగిరి చేసేందుకే ఉపయోగపడతారు కానీ రాష్ట్రానికి ఒరిగేదేముండదని విమర్శించారు. కాంగ్రెస్ కి ఓటేసినా నెహ్రూ కుటుంబానికి వేసినట్టే. ఈ రెండు పార్టీల నుండి గెలిచే ఎంపీలు ఆ రెండు కుటుంబాలకి గులాంగిరి చేస్తారు. బీజేపీకి ఓటేస్తే దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గులాబీ గ్రాఫిక్స్ ను సృష్టించి ప్రజలను మభ్యపెట్టారు. కేసీఆర్ రజాకార్ల నాయకుడిగా చెలామణి అవుతున్నాడని మండిపడ్డారు.

ఈ ఎన్నికల దేశానికి సంబంధించిన ఎన్నికలు. దేశ ప్రజలు సమర్ధవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 16 సీట్లు గెలిస్తే ఎవరు ప్రధాని అవుతారో చెప్పే ధైర్యం కేటీఆర్ కి ఉందా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కి కూడా ప్రధానిని ప్రకటించే ధైర్యం లేదన్నారు. డబ్బుల ఆధారంగా టీఆర్ఎస్ గత ఎన్నికల్లో గెలిచింది. తెలంగాణ ప్రజలు ప్రధానిగా మోడీని కోరుకుంటున్నారు. ప్రజల్లో విశ్వాసం మోడీ కల్పించారన్నారు. పాకిస్తాన్ కి పట్టిన దయ్యాన్ని వదిలించిన ఘనత మోడీది. సేవకులు కావాలా లేక కుటుంబాలకు బానిసలు కావాలా ప్రజలు ఆలోచించాలని కిషన్ రెడ్డి అన్నారు.

నిన్న కేటీఆర్ సభ కోసం విద్యార్థులను ఎండలో రోడ్లపై నిలబెట్టారు. ఇది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించినట్టే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి బీజేపీ డిమాండ్ చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇంకా బీజేపీ ఎక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు పేర్లతో లిస్ట్ పంపమని కేంద్ర పార్టీ కోరింది. పార్లమెంట్ క్లస్టర్ల మీటింగ్ తర్వాత సమావేశం అయి ముగ్గురి పేర్లతో జాబితా తయారు చేసి పంపిస్తాం అని కిషన్ రెడ్డి తెలిపారు.