మీ పిల్లలైతే ముద్దు.. పేద పిల్లలైతే కనికరం లేదా..?

మీ పిల్లలైతే ముద్దు.. పేద పిల్లలైతే కనికరం లేదా..?

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు బేషరతుగా రూ. 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్... వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని జ్యోతి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలతో ఉజ్వల భవిష్యత్ కోరుకున్న తల్లిదండ్రుల ఆశలు అడిఆశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల పరీక్షలు బాగా రాసినా.. మార్కులు రాలేదని ఉద్వేగంతో  27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న లక్ష్మణ్.. బీజేపీ మొదటి నుంచి ఈ ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించిందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 3 లక్షల మంది వరకు ఫెయిల్ కావడం శోచనీయం అన్నారు. అర్హతలు లేని గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు అప్పజెప్పి ఇంటర్ బోర్డు, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. మీ పిల్లలైతే ముద్దు, పేద పిల్లలైతే కనికరం లేదా? అంటూ ఫైర్ అయ్యారు లక్ష్మణ్.