టీఆర్ఎస్‌కు 50 సీట్లు వస్తే చాలా ఎక్కువ...

టీఆర్ఎస్‌కు 50 సీట్లు వస్తే చాలా ఎక్కువ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు వస్తే చాలా ఎక్కువ అన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్... మల్కాజ్‌గిరి అసెంబ్లీ బీజేపీ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ వల్ల ఆయన కుటుంబం బంగారు కుటుంబం అయింది... కానీ, బంగారు తెలంగాణ కాలేదన్నారు. కేసీఆర్‌ది నాలుగేళ్ల దుష్టపాలన అన్న ఆయన... తెలంగాణ ప్రభుత్వం మోస్ట్ కరప్సన్ ప్రభుత్వమని... దేశంలోనే అవినీతిలో రెండో స్థానంలో ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. కేసీఆర్, ఆయన కొడుకు, ఆయన కూతురు ప్రభుత్వం ఇది అని సెటైర్లు వేసిన రామ్‌మాధవ్‌... హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికే అనుమతి దొరకకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కారణంగానే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్న రామ్‌మాధవ్‌... కేసీఆర్ విజన్‌లెస్ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. 

మతతత్వ పార్టీ అయిన మజ్లీస్ తో అంటకాగే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బీజేపీని మతత్వ పార్టీ అనే అర్హతలేదన్నారు రామ్‌మాధవ్‌... బీజేపీ అభివృద్ధి మంత్రంతో పాలన చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. లక్షా 15 కోట్లు ఇస్తే టీఆర్ఎస్ సర్కార్ లెక్కలు చెప్పడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు కావాలి... అందుకే టీఆర్ఎస్ సర్కార్‌ను మార్చాలని పిలుపునిచ్చారు. టీడీపీ తెలుగు ద్రోహం పార్టీ అంటూ వ్యాఖ్యానించిన బీజేపీ నేత... కాంగ్రెస్ పార్టీకి జీవం పొసే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ డబ్బు సంచులు పంపుతోందని విమర్శించారు. అవినీతిపరులను పట్టుకుంటే టీడీపీ నేతలు కక్ష్యసాధింపు అంటున్నారని... కేంద్రంలో మోడీ పాలన ఉంది అవినీతిపరులను వదిలేదిలేదన్నారు.