ఇంకా తేలని మహా రాజకీయం...మళ్ళీ ఎన్నికలు ?

ఇంకా తేలని మహా రాజకీయం...మళ్ళీ ఎన్నికలు ?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. త్వరలో సర్కారు ఏర్పాటవుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేస్తున్నా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ జోక్యం చేసుకోవాలని శివసేన నేత లేఖ రాయడం కలకలం రేపుతోంది. మరో పక్క ప్రస్తుత పరిణామాల తరుణంలో తాము వేచిచూసే వైఖరి అవలంబిస్తున్నట్టు ఎన్సీపీ ప్రకటించింది. అలాగే గవర్నర్ తో వరుస భేటీలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు శివసేన ముఖ్య నేతలు సంజయ్‌ రౌత్‌, రాందాస్‌ కదం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలువగా అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు.

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని రౌత్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చన్న ఊహాగానాల తరుణంలో శరద్‌  పవార్‌ సోనియాతో భేటీ అయ్యారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనంటూ ఎన్సీపీ ఇప్పటికే సంకేతాలు పంపింది.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా బీజేపీ నాయకత్వంతో చర్చించారు.  సీఎం పదవి పంచే ప్రసక్తే లేదని, అయితే ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం విషయంలో శివసేనకు డోర్లు తెరిచే ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అటు మహా సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కు శివసేన నేత లేఖ రాయడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పంపిస్తే.. ఈ సమస్యను రెండు గంటల్లో పరిష్కరిస్తారని పేర్కొనడం కూడా చర్చనీయాంశమైంది. శివసేన మొండికేస్తే మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి కూడా అభ్యంతరం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.