కర్ణాటకంలో ఇక స్పీకర్ వంతు..?

కర్ణాటకంలో ఇక స్పీకర్ వంతు..?

ఎన్నో మలుపులు తీసుకున్న కర్ణాటక రాజకీయం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రిగా శుక్రవారం యడియూరప్ప ప్రమాణస్వీకారం చేయడంతో.. కర్ణాటకం మళ్లీ కమలం వికసించగా.. ఇప్పుడు యడియూరప్ప ముందు బలపరీక్ష గండం ఉంది. అయితే, దానిని గట్టేకాలంటే.. స్పీకర్‌ రమేష్‌ కుమార్‌పై వేటు వేయడమే మంచిదని భావిస్తున్న కమలం దళం.. ఆ వైపుగా పావులు కదుపుతోన్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు.. మిగతా ఎమ్మెల్యేల రాజీనామాలను పరిశీలించే ఆలోచనలో ఉన్నారు. అయితే, రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మాత్రం యడియూరప్ప సీఎం ఆశలు మరోసారి చేజారిపోతాయి. దీంతో.. వీలైనంత త్వరగా స్పీకర్‌ను తప్పించే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అసలే, రమేష్ కుమార్ కొరకరాని కొయ్యలాంటి వ్యక్తి అనే పేరు ఉంది.. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తానని ప్రకటించారాయన.. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.

స్పీకర్‌ను తప్పిస్తే ఆయనకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఉండదు. రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తామంటున్న తరుణంలో వారిని కాపాడుకోవడం ఇప్పుడు వారికి ఎంతో ముఖ్యం.. ఇక వేళ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈరోజే స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నా బీజేపీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేయడం సాధ్యంకాదు. బీజేపీ కల నెరవేరాలంటే స్పీకర్‌ను తప్పిస్తేనే బెటర్ అనే ఆలోచన చేస్తోంది. స్పీకర్‌ పదవి లేనప్పటికీ రమేష్‌కుమార్‌కు 14 రోజుల నోటీస్‌ పిరియడ్‌ ఉంటుంది. అయితే ఆయన ఆ సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం కోల్పోతారు. అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు ఉన్న పార్టీ.. ఆర్టికల్ 179(సీ) ప్రకారం స్పీకర్‌ను తొలగించే అవకాశం ఉంది. దీంతో, రమేష్‌ కుమార్‌ను స్పీకర్ చైర్ నుంచి తప్పించాలని బీజేపీ భావిస్తోంది. జేడీఎస్‌కు చెందిన ఆయనను అవిశ్వాస తీర్మానంతో తొలగించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.