ఒంటరి కానున్న బీజేపీ 

ఒంటరి కానున్న బీజేపీ 

ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న వేళ... బీజేపీ హవా తగ్గుతోందా అంటే అవుననే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు కూడా రోజు రోజు తరిగిపోతున్నాయి. ఇటీవల ప్రత్యేక హోదా విషయంలో మోడీ రాష్ట్రానికి మోసం చేశారని టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో పీడీపీకి బీజేపీ గుడ్ బై చెప్పటంతో ... పీడీపీ కూడా ఎన్డీఏ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. లోక్ సభలో పీడీపీ ఎంపీ ఒక్కరే అయినా... ఆ ప్రభావం ఎన్డీఏ పక్షాలపైన పడే అవకాశం ఉంది. దీంతో బీజేపీపై తప్పుడు సంకేతాలు వెళ్లనున్నాయి. ఇప్పటికే ఎన్డీఏలోని కొన్ని పార్టీలు బీజేపీపై గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా శివసేన లాంటి పార్టీలు. బీహార్ నితీష్ కుమార్ కూడా కమలనాథులపై అప్పుడప్పుడు కన్నెర్ర జేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఆయన కలిసి ఉంటాడనే నమ్మకం లేదు. ఇలా దేశవ్యాప్తంగా పరిస్థితులు చూస్తే కమలానికి ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమలం రేకులు ఒక్కటొక్కటిగా రాలుతుంటే ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం మొదలైందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధన పేరుతో అమిత్ షా, మోడీ ద్వయం చేస్తున్న ప్రయత్నం దండగే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో యేడాదిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కమలనాథుల్లో ఈ పరిస్థితులు టెన్షన్ పెంచుతున్నాయి. ప్రస్తుతం బీజేపీకి డెంజర్ బెల్స్ మోగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్లు ఎక్కువే. నాలుగేళ్లలోజరిగిన పలు ఉపఎన్నికల్లో 10 సీట్లను బీజేపీ కోల్పోయింది. ఎంపీల సంఖ్య 272కు పడిపోయింది. తాజా ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఓట్ల శాతం కూడా బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. మోడీ గ్రాఫ్ పడిపోతుందనే అభిప్రాయంతో ఆ పార్టీతో ఉంటే రాష్ట్రాల్లో మొదటికే మోసం వస్తుందని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నట్లు సమాచారం.  రోజు రోజుకు కమలం గ్రాఫ్ నేల చూపు చూస్తుండటంతో ఆ పార్టీ అధినేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. బీజేపీకి కేవలం సీట్లే కాదు ఓట్ల శాతం కూడ దారుణంగా తగ్గుతోంది. సీట్లతో పాటు ఓట్లు కూడా తగ్గటంతో కమలనాథుల్లో టెన్షన్ మొదలైంది.