హైదరాబాద్‌ బరిలో వివాదాస్పద ఎమ్మెల్యే?

హైదరాబాద్‌ బరిలో వివాదాస్పద ఎమ్మెల్యే?

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఈసారి హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారా? అంటే అవుననే బీజేపీ వర్గాలు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీకి చెక్‌ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న కషాయ పార్టీ.. అందుకు రాజాసింగే సరైన వ్యక్తి అని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 2004 నుంచి ఓటమి ఎరుగని అసదుద్దీన్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే రాజాసింగ్‌ వల్లే సాధ్యమని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. 'ప్రస్తుతం రాజాసింగ్‌ ప్రాతినధ్యం వహిస్తున్న గోషామహల్‌.. హైదరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నది. పాతబస్తీ యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉన్నది. ఆయన పోటీ చేస్తే హిందూ ఓట్లు భారీగా పడే అవకాశముంది' అని బీజేపీ నేతలు చెబుతున్నారు. 
ఇటీవల నగర పర్యటనకు వచ్చిన బీజేపీ బాస్‌ అమిత్‌ షా.. రాజాసింగ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. పాత నగరంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.  హైదరాబాద్‌ లోక్‌సభ బరిలోకి దిగాల్సి ఉంటుందని రాజాసింగ్‌కు ఈ భేటీలోనే షా హింట్‌ ఇచ్చారని తెలుస్తోంది. 
మరోవైపు.. హైకమాండ్‌ ఆదేశిస్తే ఎక్కిడి నుంచైనా పోటీకి తాను సిద్ధమేనని రాజాసింగ్‌ చెబుతున్నారు. ఇటీవల అమిత్‌ షా ను తాను కలిసిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. పాత నగరంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతోపాటు గోషామహల్‌లో తాను చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారని రాజా చెప్పారు.