ఆ భేటీ జరిగినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ

ఆ భేటీ జరిగినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ

బీజేపీ చీఫ్ అమిత్ షాతో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ని తాను కలిపానని చేస్తున్న ఆరోపణలను నిరూపించగలిగితే దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యేల ఆకుల సత్యనారాయణ... అబద్ధాల పునాదులపై టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించిన ఆయన... మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్‌నాథ్‌రెడ్డి, నారా లోకేష్, లోకేశ్, సీఎం చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా... అమిత్ షా, బుగ్గనను తాను కలిపినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అన్నారు. ఏపీ భవన్ ప్రభుత్వ గెస్ట్ హౌస్... ఎవరైనా రావొచ్చు... అన్ని పార్టీల వారు ఇక్కడకు వస్తారు... కలుస్తారు. అంతమాత్రాన, దీనికి రాజకీయాలను ఆపాదించడం సరికాదన్నారాయన. 

కుట్ర రాజకీయలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థం అవుతోందన్నారు ఎమ్మెల్యే  ఆకుల సత్యనారాయణ... గ్రామ స్థాయిలో జన్మభూమి కార్యక్రమంలో అవినీతి జరిగిందని  అనుకున్నాం... కానీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతోందన్నారు. అయితే నేను, బుగ్గన రాజేంద్రనాథ్ కలిసిన మాట వాస్తవమే... ఇద్దరం కలిసి షాంగ్రీలా హోటల్‌లో భోజనం చేసిన మాట కూడా వాస్తవమే... ఇక్కడ రహస్యం ఎక్కడ ఉంది.. బహిరంగంగానే కలిశాం కదా అని వ్యాఖ్యానించిన ఆయన... ఇక, సీక్రెట్ ప్లేస్ ఎక్కడ ఉందో, లోకేష్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డ ఆయన... రాష్ట్రంలో సుపరిపాలన ఇస్తారు అని ఏపీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ... దానికి టీడీపీ విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శించారు.