మహిళను కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే

మహిళను కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే

కుళాయి కనెక్షన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసున్న ఓ మహిళను గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బలరామ్‌ థవాని కాలితో తన్నడం వివాదాస్పదంగా మారింది. గుజరాత్‌లో ఈ ఘటన జరిగింది. నిరసన వ్యక్తం చేసిన మహిళ ఎన్సీపీ కార్యకర్త కావడంతో వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది. 

నిన్న ఉదయం ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నీతూ తేజ్వాని అనే మహిళ నేతృత్వంలోని మహిళలు కొంతమంది నిరసన ప్రదర్శన చేశారు. తొలగించిన కుళాయి కనెక్షన్లను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బలరామ్‌ వారిని చెదరగొట్టే క్రమంలో నీతూ తేజ్వానిని కాలితో తన్నారు. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో ఎమ్మెల్యే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ప్రకటించారు. ఐతే.. నీతూ తేజ్వాని భర్త మొదట తనపై దాడి చేశారని.. అడ్డుకునే క్రమంలో తాను ఎదురుతిరగాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే చెబుతున్నట్టుగా నీతూ తేజ్వాని భర్త దాడి చేయలేదని ఆమె అనుచరులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరులే నీతూ తేజ్వానిపై తొలుత దాడి చేశారని, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా తన్నారని చెప్పారు.