జనసేన ఓ చిల్లర పార్టీ...బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

జనసేన ఓ చిల్లర పార్టీ...బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

హిందువులను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. నిన్న సాయంత్రం తిరుపతిలో జనసేన కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మతాల పేరున విడగొడుతూ రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని వ్యాఖ్యలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అసలు హిందువా, కాదా? జనసేన పార్టీలో హిందువులే లేరా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. హిందువుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. ‘ఖబర్దార్.. పవన్ కళ్యాణ్’ అంటూ హెచ్చరించారు.

ఈ మేరకు నిన్న రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. హిందువులు కొట్లాటలు పెట్టే వాళ్ళని పవన్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ హిందువేనా? వేరే మతంలోకి వెళ్ళారా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ హిందూ సమాజాన్ని టార్గెట్ చేశారని, హిందూ సమాజం గూర్చి పవన్ కు తెలియదనుకుంటా అని అన్నారు. అలాగే ఎన్నికలు అయిపోయాయి కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావ్? హిందూధర్మం ఉండొద్దనుకుంటే నేరుగా చెప్పండి అని అన్నారు. ఒకప్పుడు తాను పవన్ కళ్యాణ్ అభిమానినని.. ఇప్పుడు ఆయణ్ని పేరు పెట్టి పిలవాలంటేనే ఏదోలా ఉందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.