తొలిరోజు వ్యాక్సినేషన్ తీసుకున్న ఇద్దరు పొలిటిషియన్లు... 

తొలిరోజు వ్యాక్సినేషన్ తీసుకున్న ఇద్దరు పొలిటిషియన్లు... 

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిరోజు విజయవంతంగా ముగిసింది.  తొలిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.  తొలివిడతలో కోటిమంది వైద్యసిబ్బందికి, రెండుకోట్ల మంది కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే, పొలిటిషియన్లకు తొలివిడతలో అవకాశం లేదని, తమ వంతు వచ్చేవరకు వేచి చూడాల్సిందే అని ప్రధాని మోడీ ఇప్పటికే పేర్కొన్నారు.  ఇక ఇదిలా ఉంటె, దేశంలో ఇద్దరు పొలిటిషియన్లు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.  అందులో ఒకరు బీజేపీ ఎంపికాగా, రెండో వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.  

యూపీలోని గౌతమ బుద్ధ నగర్ బీజేపీ ఎంపీ 61 ఏళ్ల డాక్టర్ మహేష్ శర్మ కరోనా టీకా వేయించుకున్నారు.  గతంలో డాక్టర్ గా విధులు నిర్వహించడంతో ఆయనకు టీకాను అందించారు వైద్యులు.  టీకా సమర్ధతపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, దేశీయంగా తయారైన టీకాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, కరోనా మహమ్మారి త్వరలోనే అంతం అవుతుందని అన్నారు.  అదే విధంగా పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ నేత కట్వా నియోజక వర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.  వ్యాక్సిన్ పై భరోసా ఉందని, ప్రజల్లో దైర్యం కలిగించేందుకు టీకా తీసుకున్నట్టు అయన పేర్కొన్నారు.