దుబ్బాకలో బీజేపీ గెలుస్తుంది..!

దుబ్బాకలో బీజేపీ గెలుస్తుంది..!

తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఇక, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు... మరోవైపు గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.. అయితే.. దుబ్బాకలో గెలిచేది బీజేపీయే అని జోస్యం చెప్పారు ఆ పార్టీ ఎంపీ అరవింద్... నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.. దుబ్బాక ఎన్నికల కోసం మక్కలకు రూ.100-150 ఎక్కువిస్తామని అబద్దాలు చెప్పారని విమర్శించిన ఆయన.. సన్న రకం సాగు చేయమని మంచి ధర ఇప్పిస్తానని చెప్పున కేసీఆర్ మాట తప్పారని దుయ్యబట్టారు.. సీఎం కేసీఆర్‌ తీరుతో రైతులు ఆవేదన చెందుతున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న ఎంఎస్పీకి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వటం లేదని.. కడ్త పేరుతో 9శాతం తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ. 

ఇక, పౌల్ట్రీ యజమానుల కోసం మక్క రైతులను, రైస్ మిల్లర్ల కోసం వరి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ అరవింద్.. రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారన్న ఆయన.. కేసీఆర్ తీరుతో రైతులకు ప్రభుత్వాలపై నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ముస్లింలకు కేంద్రం అన్ని ఇస్తున్నా కేసీఆర్ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించిన బీజేపీ ఎంపీ.. పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థ కేంద్రం ఇచ్చినా,  రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ సర్కార్ అప్పుల్లో ముంచేసింది.. విద్యుత్ బకాయిలు ఎగ గొట్టేందుకు విద్యుత్ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.