ఓటమి భయంతోనే ఈసీపై ఆరోపణలు

ఓటమి భయంతోనే ఈసీపై ఆరోపణలు

ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పుడు ఈవీఎంను తప్పు బడుతున్న చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ లో ఉన్నారని విమర్శించారు. ఏపీలో మూడు కోట్లమంది ప్రజలు ఓటు హక్కును  వినియోగించు కున్నారన్నారు. వారికి రాని అనుమానం చంద్రబాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓ పరిపక్వత గల రాజకీయ నాయకుడు అలా ప్రవర్తించరాదని, చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఎందుకని ప్రశ్నించారు. ఆయనలో ఆ హుందాతనం కనిపించకపోగా, చౌకబారుతనం కనిపించిందని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు యాగీ చేస్తున్నారని జీవీఎల్‌ ప్రశ్నించారు.  

చంద్రబాబు తన ఓటమికి కారణం ఇతరులపైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీ భవన్లో గతంలో ఆడిన నాటకానికి రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టారు. చంద్రబాబు పదినెలల నాటకాన్ని ప్రజలు తిప్పి కొట్టారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని చంద్రబాబు ఢిల్లీలో దండోరా వేస్తున్నారు. ఆయన నిరాశ నిస్పృహలు చూస్తే అందరికీ ఇదే అనిపిస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు చూపించిన అహంకారం దుర్యోధనుడిని తలపించింది. ఏపి ఇంటలిజెన్స్ ఛీఫ్ రాజకీయ సలహాదారు గా  పనిచేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, ఎమ్మెల్యేలను కొనడం లో ఇంటలిజెన్స్ పాత్ర ఉందని అందరూ అంటున్నారు. పోలీస్ అధికారులను పొలిటికల్ మేనేజ్మెంట్ కోసం వాడుకుంటున్నారు. బాక్స్ బద్దలయిందని చంద్రబాబు భయం ఉంది. అందుకే చంద్రబాబు కొత్త డ్రామాలకు తెర తీశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా వస్తుందో రాదో అన్న అనుమానం ఉంది అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.