టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే..

టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే..

లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి సింగల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు జోస్యం చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మే 23 తర్వాత రాజకీయాల్లో చంద్రబాబు ప్రాతినిధ్యాన్ని కోల్పోతారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో కూడా అనుమానమేనని అన్నారు.  ఆ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయని జీవీఎల్‌ విశ్లేషించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తర్వాత అవినీతి చిట్టా బయటకి రాబోతుందని హెచ్చరించారు. చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు.

'మే 23వ తేదీన బీజేపీకి పూర్తి మెజారిటీ రానుంది. ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు పూర్తి అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా నరేంద్ర మోడీకి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం కూడా పెరగనుంది. మంచి పరిపాలనకు ప్రజలు పట్టం కట్టడం శుభసూచకం. అభివృద్ధికి ఓట్లు పడవు.. అనే సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ చేధించారు. అభివృద్ధి ఆధారంగానే మూడుసార్లు మోడీ సీఎం అయ్యారు. మరోసారి ప్రధాని గా ఎన్నిక కాబోతున్నారు. “మిషన్  2024” తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కేరళలో ప్రబల రాజకీయ శక్తిగా ఎదుగుతాం. తెలుగుదేశం ఓటమితో “బీజేపీ మిషన్” ప్రారంభం అవుతుంది. ఏపిలో బీజేపీ అభివృద్ధికి టీడీపీ ఓటమితో నాంది వాచకం పలుకుతాం. కాంగ్రెస్ కు 50 60 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు' అని జీవీఎల్ అన్నారు.