అందుకే టీడీపీ బోల్తా...!

అందుకే టీడీపీ బోల్తా...!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నందుకు వైఎస్ జగన్‌కు శుభాకంక్షలు తెలిపిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు... టీడీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతి ఆరోపణలు, అహంకారం టీడీపీని ఓడించాయన్నారు. నరేంద్ర మోడీని విమర్శించిన తీరు, జగన్‌పై దాడిని విమర్శించిన తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశాయన్న ఆయన.. ఒకరిని దూషించి, విషంకక్కి తాను ఎదగాలని చూచి టీడీపీ బోల్తాపడిందన్నారు. ఇక మమ్మల్ని నష్టపరచాలని చూచి టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని సెటైర్లు వేసిన జీవీఎల్... రాబోయో ఎన్నిల్లో బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటుందన్నారు. టీడీపీ ఎంపీలు హుందాగా రాజకీయాలు చేయకుండా రచ్చ చేశారు అందుకునే అపజయం పాలయ్యారని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఏ పార్టీకి కమిట్‌మెంట్ ఓటు లేదు... నమ్మిన పార్టీకి మాత్రమే ప్రజలు ఓటు వేస్తారన్నారు బీజేపీ ఎంపీ. ఎపీకి కేంద్రం సహకరించ లేదని చెప్పడం టీడీపీ వ్యూహంలో భాగమేనన్న ఆయన.. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి అధికంగా నిధులు ఇచ్చామని గుర్తుచేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని వెల్లడించిన జీవీఎల్.. పరస్పర సహకారంతో కేంద్ర, రాష్ట్రాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

మోడీ నాయకత్వంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు జీవీఎల్ నర్సింహారావు.. 25 కోట్ల ప్రజలకు సంక్షేమ పథకాలు మోడీ అందించారన్న ఆయన... మోడీ పాలనలో దేశ ఖ్యాతి పెరిగిందన్నారు. బీజేపిని గెలిపిస్తే భారతదేశాన్ని గెలిపించడంగా ప్రజలు భావించారని పేర్కొన్న ఆయన.. ప్రజలలో విశ్వసనీయత ఉన్న వ్యక్తి మోడీ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాల్లో విజయం సాధించడంలో అక్కడ పార్టీ పుంజుకుందన్న బీజేపీ ఎంపీ.. త్వరలోనే ఏపీలోనూ పుంజు‌కుంటామన్నారు. మరోవైపు వంశపారంపర్య రాజకీయాలకు ఈ ఎన్నికలు గండి కొట్టాయన్నారు. లోకేష్, కవిత, అఖిలేష్ యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, రాహుల్ గాంధీ ఓడిపోయారని అభిప్రాయపడ్డారు.